ముడి చమురు బ్యారెల్ 120 డాలర్లపైకి.. నాలుగేళ్ల గరిష్ఠానికి క్రూడ్ ధరలు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పశ్చిమాసియాలో (Middle East) యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్న భయాలతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి
రెట్టింపైన ధరలు..
తాజా ఉద్రిక్తతల నడుమ ప్రపంచ బెంచ్‌మార్క్ ‘బ్రెంట్ క్రూడ్’ (Brent Crude) ధర బ్యారెల్‌కు ఏకంగా 126.41 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరి, గత నాలుగేళ్ల రికార్డులను బద్దలుకొట్టింది. ఆ తర్వాత ట్రేడింగ్ కాస్త నెమ్మదించి 115.8 డాలర్లకు పడిపోయినప్పటికీ.. యుద్ధ భయాలు మొదలవ్వడానికి ముందు ఉన్న 73 డాలర్ల స్థాయితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. మరోవైపు డబ్ల్యూటీఐ క్రూడ్ (Crude Oil) కూడా క్షీణించి 106 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
హోర్ముజ్ చుట్టూ ముసురుకున్న ముప్పు
ఈ ఆకస్మిక ధరల మంటకు, సరఫరా అంతరాయాలకు ప్రధాన కారణం ‘హోర్ముజ్ జలసంధి’ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే. ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు, సహజ వాయువు రవాణాలో దాదాపు 20 శాతం వాటా ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఈ మార్గంలో ఏమాత్రం ఆటంకం ఏర్పడినా గ్లోబల్ సప్లై చైన్ (Crude Oil) కుప్పకూలుతుంది. తాజా షిప్పింగ్ డేటా ప్రకారం.. ఇక్కడ చమురు ట్యాంకర్ల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA), దీనిని చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా అభివర్ణించింది.
సామాన్యుడికీ ద్రవ్యోల్బణ సెగ
చమురు మంట (Crude Oil) సెగలు అప్పుడే సామాన్యులను తాకుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు 4.30 డాలర్లకు చేరి నాలుగేళ్ల గరిష్ఠాన్ని తాకాయి. ఈ భారం కేవలం వాహన ఇంధనాలకే పరిమితం కాలేదు. ముడి చమురు ధరలు పెరగడంతో ప్లాస్టిక్, సింథటిక్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్ తయారీ వ్యయాలు పెరుగుతున్నాయి. అలాగే రవాణా ఖర్చులు తడిసి మోపెడవడంతో నిత్యావసర ఆహార పదార్థాల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముఖ్యంగా తమ ఇంధన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపై ఆధారపడే భారత్ లాంటి ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఇది పెను ముప్పుగా పరిణమించింది.
మాంద్యం ముప్పు తప్పదా?
పశ్చిమాసియా సంక్షోభం త్వరగా కొలిక్కి రాకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఫ్యూచర్స్ మార్కెట్‌ను మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. చమురు (Crude Oil) సరఫరాలో ఈ అంతరాయం ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్యంలోకి కూరుకుపోవడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
