ఏసీ కొనే ప్లాన్ ఉందా? అయితే మీ జేబుకు భారీ చిల్లు గ్యారెంటీ..!
ఎండాకాలం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అప్పు చేసైనా సరే ఓ ఏసీ (Air Conditioner) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక చేదువార్త. రాబోయే నెలల్లో ఏసీల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరబోతున్నాయంటూ ప్రముఖ ఏసీల తయారీ సంస్థ ‘బ్లూస్టార్’ (Blue Star) మేనేజింగ్ డైరెక్టర్, సీఐఐ (CII) వెస్ట్రన్ రీజియన్ ఛైర్మన్ వీర్ ఎస్ అద్వానీ గట్టి షాక్ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఏసీల ధరలు ఊహించని స్థాయిలో మరింత పెరగనున్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. అసలేం జరుగుతోంది? ఏసీల ధరలు ఎందుకింతలా మండిపోతున్నాయో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
రెండు ప్రధాన కారణాలు
ఏసీల (Air Conditioner) ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ముడిసరుకుల మంట: ఏసీల తయారీలో అత్యంత కీలకంగా ఉపయోగించే రాగి (Copper), అల్యూమినియం (Aluminum), ఉక్కు (Steel) తదితర లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా పెరిగిపోయాయి. సప్లై చైన్ సమస్యల వల్ల వీటి వ్యయం తడిసి మోపెడవుతోంది.
కొత్త ఎనర్జీ రూల్స్: ఈ ఏడాది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏసీల (Air Conditioner) కోసం ‘కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ నిబంధనలు’ (New Energy Norms) అమలులోకి తెచ్చింది. విద్యుత్ ఆదాను పెంచేందుకు ఉద్దేశించిన ఈ కఠిన ప్రమాణాలకు అనుగుణంగా తయారీ ప్రక్రియను మార్చడం కంపెనీలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నయా టెక్నాలజీ తయారీ వ్యయాన్ని అమాంతం పెంచేసింది.
పదేళ్లలో ఎన్నడూ లేనంతగా..
ఈ మార్పుల కారణంగా పరిశ్రమలో ఇప్పటికే ధరల మోత మొదలైంది. అద్వానీ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొద్ది కాలంలోనే ఏసీల (Air Conditioner) ధరలు ఏకంగా 14 నుంచి 16 శాతం వరకు పెరిగాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఏసీల ధరల్లో ఒకేసారి ఇంత భారీ స్థాయిలో పెరుగుదల నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అసలు షాక్ ముందుంది!
అయితే వినియోగదారులకు అసలు షాక్ ఇక ముందే ఉంటుందని అద్వానీ హెచ్చరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా మార్కెట్లో లభిస్తున్న ఏసీల్లో చాలావరకు పాత నిబంధనల ప్రకారం తయారైనవే. కంపెనీల వద్ద ఉన్న ఆ పాత స్టాక్ కారణంగానే, పెరిగిన తయారీ ఖర్చుల పూర్తి భారం ఇంకా వినియోగదారుల పైకి పూర్తిగా బదిలీ కాలేదు. కానీ ఇప్పుడు ఆ పాత స్టాక్ అంతా దాదాపుగా క్లియర్ అయిపోతోంది.
ఇకపై మార్కెట్లోకి వచ్చే ప్రతీ ఏసీ (Air Conditioner).. కచ్చితంగా ఈ కొత్త, ఖరీదైన ఎనర్జీ ప్రమాణాలతో (కొత్త స్టాక్) మాత్రమే వస్తుంది. కాబట్టి వీటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ అదనపు భారాన్ని కంపెనీలు తమ జేబుల్లోంచి భరించలేవు కాబట్టి, అనివార్యంగా ఆ మొత్తం భారాన్ని సామాన్య కొనుగోలుదారుడి పైకే నెట్టేయక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో రానున్న రోజుల్లో బ్రాండెడ్ ఏసీల ధరలు మరింత భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ధరల మార్పులను దృష్టిలో ఉంచుకోవడం మేలు.
ఇవి కూడా చదవండి
