Flight: విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..!
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానాల్లో సీట్ల కేటాయింపుపై జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణం చేసే వారికి ఇకపై అదనపు చార్జీల భారం తగ్గనుంది. విమాన సంస్థలు ‘వెబ్ చెక్-ఇన్‘(Web Check In) పేరుతో ప్రతి సీటుకూ వసూలు చేస్తున్న చార్జీలపై కేంద్ర పౌర విమానయాన శాఖ (MoCA) కొరడా ఝుళిపించింది. విమానంలోని 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు ఉచితంగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు చాలా విమాన సంస్థలు వెబ్ చెక్-ఇన్(Check-In) సమయంలో దాదాపు అన్ని సీట్లను ‘పెయిడ్ సీట్లు’గా చూపిస్తూ ప్రయాణికుల నుండి రూ. 200 నుండి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నాయి. మధ్య సీటుకు కూడా డబ్బులు కట్టాల్సి వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ 60% ఉచిత సీట్ల నిబంధనను తీసుకొచ్చింది. విమానంలోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లు ‘ఫ్రీ’ కేటగిరీలో ఉండాలి. ప్రయాణికులు వెబ్ చెక్-ఇన్ చేసుకునేటప్పుడు ఈ సీట్లను ఎంచుకుంటే రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి
లెగ్ రూమ్ ఎక్కువగా ఉండే సీట్లు, ముందు వరుస సీట్లు లేదా విండో సీట్ల వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్న మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే ఎయిర్ లైన్స్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో.. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి సీట్ల కోసం అయ్యే అదనపు వేల రూపాయల భారం తగ్గనుంది. సీట్ల కేటాయింపులో విమాన సంస్థలు అనుసరిస్తున్న అపారదర్శక పద్ధతులకు ఈ నిర్ణయంతో బ్రేక్ పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విమానయాన సంస్థలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుందని విమానయాన సంస్థలు వాదిస్తున్నాయి. అయితే, ప్రయాణికుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యత అని కేంద్రం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
