Hyd-Vizag: హైదరాబాద్ నుంచి విశాఖ జర్నీ మరింత ఈజీ..!
డబుల్ ఇంజిన్ సర్కార్ .. రాష్ట్రాభివృద్ధిని డబుల్ స్పీడ్ గా తీసుకెళ్తోంది. రాష్ట్ర ప్రాజెక్టులను ఆగమేఘాల మీద అమలు పరుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో నేషనల్ హైవే 365BB నిర్మాణ పనులను పరుగులెత్తిస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం. జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు రెండు లైన్ల రహదారిగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో తొలి ప్యాకేజీ పనులు ముమ్మరంగా జరుగుతుండగా, అక్టోబర్ నాటికి ఈ దశను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే మన్యం ప్రాంత వాసులకు ఐటీడీఏ కార్యాలయాలకు వెళ్లడం సులభతరం కావడమే కాకుండా, పోలవరం ప్రాజెక్టు సందర్శకులకు కూడా ఇది అతి దగ్గరి మార్గంగా మారనుంది.
ఈ హైవే నిర్మాణంతో కోస్తా ప్రాంతం నుంచి హైదరాబాద్కు ప్రయాణం మరింత సులభతరం కానుంది. జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం, కన్నాపురం, పోలవరం మధ్య ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి బాటలో నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్గంలో 14 చోట్ల బస్ షెల్టర్లు, బస్ బేలను నిర్మిస్తున్నారు. అలాగే వరద నీటి వల్ల ఇబ్బంది కలగకుండా 37 చోట్ల బాక్స్ కల్వర్టులు, 14 చోట్ల పైపు కల్వర్టులను ఏర్పాటు చేస్తున్నారు. బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం వద్ద ఈ హైవే కోసం ప్రత్యేకంగా టోల్ ప్లాజాను కూడా ఏర్పాటు చేయనున్నారు.
రెండో ప్యాకేజీ కింద చేపట్టనున్న 46.3 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కోసం డీపీఆర్ (DPR) ఆమోదం రావాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తయితే కోస్తా ఆంధ్ర మరియు తెలంగాణ మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇప్పటికే జీలుగుమిల్లి – బుట్టాయగూడెం మధ్య తారు రోడ్డు పనులు పూర్తి కాగా, ప్రస్తుతం ఎల్ఎన్డీపేట – పోలవరం మధ్య సిసి డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది..
కొవ్వూరు -జీలుగుమిల్లి రెండు వరుసలు హైవే చాలా టూరిస్ట్ ప్రాంతాలను కవర్ చేస్తూ వెళుతుంది. వాటిలో 200కు పైగా సినిమా షూటింగ్ లు జరుపుకున్న సినిమా చెట్టు ఉండే కుమారదేవం, పట్టిసీమ ప్రాజెక్టు, పట్టిసీమ టెంపుల్, పోలవరం ప్రాజెక్టు లతో పాటు పోలవరం -జీలుగుమిల్లి మధ్య ఉన్న ఏజెన్సీ (అటవీ ప్రాంతాలు ) గ్రామాలు ఉన్నాయి. ఈ హైవే వల్ల ట్రాన్స్ పోర్ట్ తో పాటు టూరిజం కూడా డెవలప్ అవుతుంది అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ హైవే పూర్తి అయితే ఇది పోలవరం ప్రాంతాల అభివృద్ధి కి గేమ్ చేంజర్ అవుతుందని అక్కడి ప్రజలు అంటున్నారు.
