నువ్వు పొంగులేటివి కాదు ‘పొంగులూటి’వి: హరీశ్‌రావు
Harish Rao: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన సంచలన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. పొంగులేటి పేల్చినవన్నీ ‘తుస్సు బాంబులే’నని ఆయన ఎద్దేవా చేశారు. తనపై , బీఆర్ఎస్ పార్టీపై మంత్రి చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ హరీశ్‌రావు మీడియా సమావేశంలో కీలక ప్రశ్నలు సంధించారు.
సీఎం చెప్పింది తప్పా.. మంత్రి చెప్పింది తప్పా?
పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ హరీశ్‌రావు ముఖ్యమంత్రిని, మంత్రిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి
అవినీతిని గుర్తించాం: “మీ మంత్రి కంపెనీలో అవినీతి జరిగినట్లు మా అధికారులే గుర్తించారని గతంలో అసెంబ్లీలో సీఎం చెప్పారు. అనుమతులు లేకుండా నడుపుతున్నందుకే నోటీసులు ఇచ్చామన్నారు. మరి ఇప్పుడు సీఎం మాట తప్పా లేక మంత్రి పొంగులేటి మాట తప్పా?” అని హరీశ్ ప్రశ్నించారు.
నోటీసుల సంగతేంటి?: నాలుగు శాఖల అధికారులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా, అసెంబ్లీలో తన కంపెనీకి మైనింగ్ లేదని మంత్రి ఎందుకు అబద్ధం చెప్పారని నిలదీశారు. తన పేరును ఉద్దేశిస్తూ పొంగులేటి కాదు.. ‘పొంగులూటి’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా కేవలం పేదల కోసమేనా?
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పందిస్తూ హైడ్రా పనితీరును హరీశ్‌రావు తప్పుపట్టారు. “అవి ప్రభుత్వ భూములైతే రెండున్నరేళ్లుగా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? హైడ్రా కేవలం పేదల ఇళ్లపైకే వెళ్తుందా? అధికారంలో ఉన్నవారి భూముల జోలికి వెళ్లదా?” అని ప్రశ్నించారు. మంత్రికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన డిమాండ్ చేశారు.
