రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ రాజీనామా సవాల్..!
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బుధవారం వరంగల్ జిల్లాలో జరిగిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. రుణమాఫీ, రైతుబంధు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతే ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి
వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అని, ఆయన ఒక రెన్యూవల్ సీఎం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం 12 వేల కోట్లు మాత్రమే చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క ఊరిలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని నిరూపిస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. రైతుబంధు నిధులను నిలిపివేసి, ఆ డబ్బును రాహుల్ గాంధీకి కప్పంగా కడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు కనిపిస్తే రైతుబంధుపై కాలర్ పట్టుకుని నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. ఇది కేవలం చిత్తు కాగితమని, రేవంత్ రెడ్డికి డబ్బుల బస్తాలు మోయడమే తెలుసు కానీ, యూరియా బస్తాలు ఇవ్వడం తెలియదని విమర్శించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర నిధుల విషయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య ఘర్షణ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.
కేటీఆర్ ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి రైతులను ఇబ్బంది పెట్టారని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నెరవేర్చని పంట బోనస్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. తాము ప్రజల్లో తిరుగుతున్నామని.. మీలాగా విదేశీ టూర్లలో కాదని ఎద్దేవా చేశారు. సమ్మక్క-సారలమ్మ ఆలయంపై కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, కమిషన్ల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని హితవు పలికారు.
హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ కూడా కేటీఆర్ విమర్శలపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని నకిలీ విత్తనాల ముఠాగా అభివర్ణించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారని, ఏడు వేల మంది రైతుల మరణానికి ఆ పార్టీయే బాధ్యత వహించాలని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర సంపదను దోచుకున్నారని, హనుమకొండ చౌరస్తాలో చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదని.. దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలని స్పష్టం చేశారు.
వరంగల్ వేదికగా మొదలైన ఈ రాజకీయ రణరంగం తెలంగాణ వ్యాప్తంగా వేడి పుట్టిస్తోంది. కేటీఆర్ విసిరిన రాజీనామా సవాల్‌ను అధికార పక్షం ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి. మొత్తానికి, అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నెలకొన్న ఈ పోరు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.
ఇవి కూడా చదవండి
