ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సిద్ధం..!
దేశ రాజధాని న్యూఢిల్లీలోని(Delhi) శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముహూర్తం ఖరారు చేసింది. మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ దివ్య ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మే 10న పుష్పయాగంతో వేడుకలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందుగా ఏప్రిల్ 28న ఆలయ శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఏప్రిల్ 30న అంకురార్పణంతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.
మే 1వ తేదీ రాత్రి 9:00 నుండి 10:30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించి, అధికారికంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి 9:00 గంటల వరకు, రాత్రి 7:30 నుండి 8:30 గంటల వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం మే 5న జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించి, అనంతరం రాత్రి 8 గంటల నుండి అత్యంత వైభవంగా గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
మే 8న రథోత్సవం, మే 9న చక్రస్నానం లాంటి విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాల ముగింపు మరుసటి రోజు అంటే మే 10న స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని భక్తులు ఈ దివ్య ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది. ముఖ్యమైన వాహన సేవలు మరియు కల్యాణోత్సవం సమయంలో పాల్గొనే భక్తులకు టీటీడీ ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయనుంది. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీలోని ఉద్యాన్ మార్గ్ (బిర్లా మందిర్ సమీపంలో) ఉన్న ఈ ఆలయం, తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా 1.2 ఎకరాల్లో నిర్మించింది టీటీడీ.
ఇవి కూడా చదవండి
