ఇరాన్ మూడంచెల ప్రణాళికపై ట్రంప్ పెదవి విరుపు..!
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దిశగా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 14 డిమాండ్లతో అమెరికాకు పాకిస్థాన్ద్వారా ఇరాన్ ఓ నూతన ప్రణాళికను సమర్పించింది. ఇది సజావుగా అమలైతే 30 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది. 14 పాయింట్ల ఈ ప్రణాళికలో మొత్తం మూడంచెలు ఉంటాయి. తొలి అంచెలో- హర్మూజ్ జలసంధిని క్రమంగా తెరుస్తారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేస్తుంది. అదే సమయంలో సముద్రంలో మందుపాతరల తొలగింపు ప్రక్రియ టెహ్రాన్ నేతృత్వంలో జరుగుతుంది.
రెండో అంచెలో- నిర్దిష్ట కాల పరిమితి తర్వాత యురేనియం శుద్ధిని (3.6% వరకే) ఇరాన్ తిరిగి ప్రారంభిస్తుంది. అది తమ గడ్డపై అణు మౌలిక వసతుల ధ్వంసానికి అంగీకరించదు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయకూడదు. టెహ్రాన్ దాడులకు దిగకూడదు. జప్తు చేసిన టెహ్రాన్ ఆస్తులను విడుదల చేయాలి. చివరిదైన మూడో అంచెలో- పొరుగున ఉన్న అరబ్ దేశాలతో టెహ్రాన్ వ్యూహాత్మక చర్చలు జరుపుతుంది. పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడతారు. భవిష్యత్తులో మళ్లీ దాడులకు దిగబోమని ఇరాన్‌కు అమెరికా హామీ ఇవ్వడం వంటి అంశాలూ కొత్త ప్రణాళికలో ఉన్నాయి. వాషింగ్టన్ ప్రతిపాదించిన 9 పాయింట్ల ప్రణాళికకు ప్రతిగా టెహ్రాన్ దీన్ని రూపొందించింది.
ఇరాన్ తాజా ప్రణాళికపై ఇప్పటికీ తాను సంతృప్తిగా లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను అంగీకరించలేనివి ఆ దేశ నేతలు అడుగుతుండటమే అందుకు కారణమని చెప్పారు. ‘47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి కలుగజేసిన నష్టానికి సరిపడా మూల్యాన్ని ఇంకా ఇరాన్ చెల్లించుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
