US-Iran War: పశ్చిమాసియా వార్ లో ట్రంప్ ఒంటరేనా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెత్తు పోకడలు, ఎవరినీ గౌరవించకపోవడం.. మిత్రులను సైతం ఎద్దేవా చేసే నైజం.. పూర్తిగా వ్యాపార గుణం.. ఇవన్నీ నాటో దేశాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్.. దౌత్యపరిధులను సైతం ఉల్లంఘించారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురో దంపతులను అరెస్ట్ చేయడం ద్వారా.. తాము అంతర్జాతీయ చట్టాలను గౌరవించేది లేదని ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈపరిణామం.. మిత్రదేశాలను సైతం షాక్ కు గురి చేసింది.
అమెరికాతో సరిహద్దు పంచుకున్న కెనడా ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో ట్రంప్ తూలనాడారు. అమెరికా రాయితీలను అనుభవించాలంటే మా దేశంలో ఓ రాష్ట్రంగా మారిపోతే సరిపోతుంది కదా అని నిష్టూరమాడారు . మెక్సికోతో ట్రంప్ వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగా ఉంటోంది. మాదక ద్రవ్యాలు ..అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయంటూ మెక్సికో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు ట్రంప్. తొలుత ట్రంప్ ను వెనకేసుకొచ్చిన దేశాలు కూడా ఇప్పుడు నెమ్మదిగా … అమెరికాకు దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక ఇటీవల అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ.. ట్రంప్ టారిఫ్ వార్ తో ప్రపంచాన్ని భయపెట్టారు. శత్రుదేశాలు, మిత్రులన్న తేడా లేదు. అందరికీ తలా ఇంత అని వడ్డించారు. అందులోనూ ఆ దేశం నుంచి తమకు ఏమి కావాలో నిర్ణయించుకుని మరీ వారిని భయపెట్టి అనుకున్నది సాధించారు.
అయితే ఆ దేశాలు భయంతో, అయిష్టంతోనే ఈ టారిఫ్ లు చెల్లించాయి. ఫలితంగా ట్రంప్ పై అవి నమ్మకం కోల్పోయాయి.
ఇప్పుడు పశ్చిమాసియా వార్ సైతం… రోజుల వ్యవధిలో తేల్చేస్తామన్నారు ట్రంప్. ఎవరినీ సంప్రదించలేదు. అనుకున్నదే తడవుగా ఇజ్రాయెల్ సపోర్టుతో రణరంగంలోకి దూకాారు. పోనీ ఆతర్వాతైనా మిత్రులను సంప్రదించారా అంటే అది లేదు. అంతేకాదు.. రోజుకో మాట… పూటకో వ్యూహం. ఆఖరుకు గల్ఫ్ దేశాలు యుద్ధానికి ప్రతిఫలంగా ఖర్చు చెల్లించాలని రూలింగిచ్చేశారు. ఈ పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తున్న ఏ దేశం కూడా ట్రంప్ వెనక ఉండేందుకు ఇష్టపడడం లేదు.ఫలితంగా అమెరికా తన చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒంటరిగా మిగిలిపోయింది. ఇప్పుడీ యుద్ధాన్ని సైతం ఒంటరిగానే చేయాల్సి వస్తోంది కూడా.
ఇవి కూడా చదవండి
