ఇరాన్-అమెరికా మధ్యవర్తిగా పాకిస్తాన్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా అమెరికా, ఇరాన్ ప్రయత్నాలు సాగుతున్నాయి. చర్చల్లో భాగంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో…ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మరియు అతని ప్రతినిధి బృందం సమావేశమైంది.. ఈ సమావేశానికి ప్రధానమంత్రితో పాటు, ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సెనేటర్ ముహమ్మద్ ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మరియు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ హాజరయ్యారు.
అయితే ఇరుదేశాలు నేరుగా చర్చలు జరపడంలేదు. వయా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. అంటే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు నేరుగా మాట్లాడుకోవడం ఉండదు. ఈ ఇద్దరు పాకిస్తాన్ ప్రతినిధులకు తమ ప్రతిపాదనలు అందిస్తారు. వాటిని పాకిస్తాన్.. వేర్వేరు పక్షాలకు అందిస్తుంది. ఇందులో ఆయాపక్షాలు ఒప్పందం దిశగా అడుగులేస్తే.. అప్పుడే నేరుగా ఇరుపక్షాలు చర్చలు సాగించే అవకాశం ఉంటుంది.
ఈ చర్చల్లో అమెరికా తరఫున ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొననున్నారు. వీరి చర్చల్లో పురోగతి కనిపిస్తే.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్కు వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేతసౌధం తెలిపింది.
కాగా.. తాజా పరిణామాలపై ట్రంప్ స్పందించారు. ఈసారి చర్చల్లో అమెరికా డిమాండ్లకు అనుగుణంగా ఇరాన్ ప్రతిపాదనలు చేయనుందని, వాటిని తాము పరిశీలిస్తామని తెలిపారు. అమెరికా షరతులకు అంగీకరిస్తేనే ఏ ఒప్పందమైనా జరుగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. టెహ్రాన్ తమ వద్ద నిల్వ ఉంచిన శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవాలని, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ట్రంప్ మరోసారి డిమాండ్ చేశారు.
