హర్మూజ్ జోలికొస్తే..మీ యుద్ధనౌకల్ని ముంచేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
హర్మూజ్ జలసంధిపై తమదే ఆధిపత్యమని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. యుద్ధనౌకలతో వచ్చినా, వేలమంది ఆర్మీని దించినా.. వెనక్కు తగ్గేది లేదని తేల్చేసింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మోహ్సేన్ రెజాయి (Mohsen Rezaei) అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే.. తమ తొలి క్షిపణి దాడికే అమెరికా (USA) నౌకలు మునిగిపోతాయని హెచ్చరించారు.
‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్‌కు రక్షక భటుడిగా మారాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనా? అమెరికా వంటి శక్తిమంతమైన సైన్యం చేయాల్సిన పనేనా ఇది. జలసంధిపై ఆధిపత్యం చూపాలని చూస్తే.. మా తొలి క్షిపణి దాడికే.. మీ నౌకలు మునిగిపోతాయి. మా క్షిపణులు కచ్చితమైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేయగలవు’ అని రెజాయి హెచ్చరించారు. తమ దాడుల్లో జలసంధి ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ఇరాన్ (Iran)పై భూతల దాడులకు ప్రయత్నిస్తే.. అమెరికా బలగాలకు నరకానికి దారి చూపిస్తామని గట్టి హెచ్చరికలు చేశారు రెజాయి. భూతల దాడులకు వచ్చిన యూఎస్ సైనికులను బందీలుగా చేసుకుంటామని హెచ్చరించారు. వారిని విడిపించుకోవాలంటే.. ఒక్కో బందీకి ఒక బిలియన్ డాలర్ ఇవ్వాల్సి వస్తుందన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
