ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్… అడ్డుకోవద్దని ఇరాన్ కు హెచ్చరిక..!
హర్మూజ్ దిగ్భంధనం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను ప్రకటించారు. ఇది పశ్చిమాసియా గొడవలతో సంబంధం లేకున్నా.. తమ నౌకలు చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న దేశాలకు మేలు చేసేందుకు తాము తీసుకున్న నిర్ణయమన్నారు ట్రంప్.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొస్తామంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు.
ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి అభ్యర్థన మేరకు హర్మూజ్ (Strait of Hormuz) నుంచి నౌకలు సురక్షితంగా బయటపడేందుకు తాము సాయం చేస్తామన్నారు. ఇందుకోసం ఆయా నౌకలకు అమెరికా బలగాలు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. దీనికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ (Project Freedom)గా పేరు పెట్టారు.
ఈ ప్రక్రియను ఒక మానవతా చర్యగా ట్రంప్ అభివర్ణించారు. చాలా నౌకల్లోని సిబ్బంది ఆహారం, నిత్యావసరాల నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాము తలపెట్టిన ఈ మానవతా ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగినా.. దాన్ని బలప్రయోగంతో ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ ప్రతినిధులు ఇరాన్‌తో సానుకూలమైన చర్చలు జరుపుతున్నారన్నారు. ఈ చర్చలు అందరికీ మంచి ఫలితాలిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
