అమెరికన్ శాస్త్రవేత్తలు మిస్టరీ మరణాలు.. ట్రంప్ సంశయం..!
అగ్రరాజ్యం అమెరికాలో సైంటిస్టుల మిస్సింగ్ షాక్ కు గురిచేస్తోంది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 10మంది ఉన్నత స్థాయి శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం లేదా అడ్రస్ లేకుండా మాయమవడం జరిగింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ.. ‘ఇది కాకతాళీయమా? లేక దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది త్వరలోనే తేలుస్తాం’ అని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నివేదికలను పరిశీలిస్తున్నామని, అతి త్వరలోనే ఈ ఘటనలకు సమాధానాలు చెబుతామని శ్వేతసౌధం ప్రకటించింది.
ఎవరా శాస్త్రవేత్తలు?
మాయమైన వారిలో ఎక్కువ మంది ‘అణుశక్తి’ లేదా ‘గ్రహంతరవాసుల నౌకల పరిశోధన(అన్ ఐడెంటీఫైడ్ ఏరియల్ ఫినామినా)(యూఏపీ/యూఎఫ్‌వో)’ల్లో నిమగ్నమైన వారే కావడం గమనార్హం. ముఖ్యంగా న్యూ మెక్సికో రాష్ట్రం నుంచే నలుగురు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మాయమైన స్పేస్ మాస్టర్
ఈ జాబితాలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మేజర్ జనరల్ విలియం నీల్ మెక్ కాస్లాండ్. పెంటగాన్‌లో అంతరిక్ష పరిశోధనలు చేసిన ఈయన, ఈ ఏడాది ఫిబ్రవరిలో అదృశ్యమయ్యారు. అయితే అదృశ్యానికి ముందు ఆయన తన ఫోన్, కళ్లజోడు, వాచీ అన్నీ ఇంట్లోనే వదిలేశారు. కేవలం తన తుపాకీ, హైకింగ్ బూట్లు, వ్యాలెట్‌ను మాత్రం తీసుకొని వెళ్లారు. కాగా, ఈయనకు 1947 నాటి ప్రసిద్ధ ‘రోస్వెల్ యూఎఫ్‌వో క్రాష్’ రహస్యాలు తెలుసని ప్రచారం జరుగుతోంది. 2016లో వికీలీక్స్ ద్వారా హిలరీ క్లింటన్ ప్రచార ఛైర్మన్ జాన్ పొడెస్టాపై జరిగిన హ్యకింగ్‌లో కాస్లాండ్ పేరు బయటపడింది. ఆయన ‘గుర్తించని వైమానిక దృగ్విషయాలు(యూఏపీ)’ల్లో పనిచేశారని పేర్కొంది. అయితే రోస్వెల్ ప్రమాదంతో కాస్లాండ్కు ఎలాంటి సంబంధం లేదని కాస్లాండ్ భార్య సుసెన్ విల్కర్సన్ సామాజిక మాధ్యమం వేదికగా తోసిపుచ్చారు.
మోనికా రెజా..
జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ(జేపీఎల్) డైరెక్టర్. గతేడాది జూన్‌లో హైకింగ్‌కు వెళ్లి అడ్రస్ లేకుండా పోయారు. తన స్నేహితుడి కంటే కేవలం 30 అడుగుల దూరంలో నడుస్తున్న ఆమె క్షణాల్లో మాయమవ్వడం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
నునో లౌరిరో…
ఎంఐటీ ప్రొఫెసర్, ఫ్యూజన్ ఎనర్జీ పరిశోధకుడు. డిసెంబరులో ఈయన్నీ తన నివాసంలోనే కాల్చి చంపారు.
కార్ల్ గ్రిల్మైర్…
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈ ఖగోళ శాస్త్రవేత్తను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు.
ఈ వరుస ఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా వద్ద ఉన్న గ్రహాంతరవాసుల రహస్యాలు, అణు రహస్యాలు బయటకు రాకుండా ఎవరో కావాలనే వీరిని అడ్డు తొలగించుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు.
హార్వర్డ్ ప్రొఫెసర్ అవి లోబ్ వంటి నిపుణులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ విడివిడి ఘటనలని, శాస్త్రవేత్తలపై ఉండే విపరీతమైన పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల ఇవి జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
