భారతీయ ఖాతాలపై వాట్సాప్ కొరడా
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయ వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తోంది. 30 లక్షల మంది భారతీయ వాట్సాప్ ఖాతాలపై బ్యాన్ విధించినట్లు సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 31 జులై వరకూ మొత్తం 30,27,000 భారతీయ వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో అసలు ఏ కారణాల వల్ల ఈ ఖాతాలు రద్దయ్యాయి? వాట్సాప్ ఇలాంటి ఖాతాలను ఎలా గుర్తిస్తుంది? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే భారతీయ మొబైల్ నంబర్లన్నీ కూడా (91)తో ప్రారంభమవుతాయన్న సంగతి తెలిసిందే. ఇలాగే భారతీయ ఖాతాలను వాట్సాప్ కూడా గుర్తిస్తుందట.
తాజాగా వాట్సాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ కంపెనీకి జూన్ 16 నుంచి జులై 31 వరకూ మొత్తం 594 ఫిర్యాదులు వచ్చాయట. వీటిలో 74 శాతాలపై చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే అకౌంట్లు రద్దు చేయడం, లేదా రద్దయిన ఖాతాలను పునరుద్ధరించడం అన్న మాట. అలాగే ఖాతా గురించి యూజర్లకు కావలసిన సహకారం అందించడం తదితర చర్యలన్నింటినీ ఈ నివేదికలో వాట్సాప్ వెల్లడించింది.






