Congress: చట్టం ముందు అందరూ సమానమే.. కేసీఆర్ విచారణపై కాంగ్రెస్ రియాక్షన్..!
అధికారం ఉందన్న ధీమాతో అందరి ఫోన్లను ట్యాప్ చేసిన కేసీఆర్ టీమ్.. విచారణ అనేసరికి గగ్గోలు పెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హత్యానేరం కన్నా.. ఫోన్ ట్యాపింగ్ మహా పాపమని.. అలాంటిది చేసి, విచారించొద్దంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు విచారణ సంస్థల ముందు హాజరు కాలేదా అని గుర్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎంతటి వారైనా చట్టం ముందు మాత్రం అందరూ సమానమే అన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో కక్షాపూరిత రాజకీయాలు నడుస్తున్నాయన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను అదేస్థాయిలో కౌంటరిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ముగిసిందని.. ఇప్పుడు ప్రజా పాలన నడుస్తోందని చెబుతున్నారు. ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ అండ్ కో పై ఆరోపణలు వచ్చాయని..వాటిని సిట్ బృందం విచారిస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పాలనలో కక్షాపూరిత రాజకీయాలు ఉండవన్నారు.
తమ అధినేత ట్యాపింగ్ కేసులో అరెస్టైతే.. బాధపడాలి కానీ.. రాష్ట్రవ్యాప్త నిరసనలు ఎందుకని ప్రశ్నించారు మరో మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం ఉన్నప్పుడు.. తనంత వాడు లేడంటూ, అందరి ఫోన్లను ట్యాప్ చేసి.. ఇప్పుడువిచారణ జరపొద్దంటే ఎలా అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేస్తున్నాయో వారికైనా అర్థం కావడం లేదన్నారు. వారి పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు పొన్నం.
ఏ తప్పు చేయకపోతే విచారణ వేళ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు హడావుడి చేస్తోంది?. చెప్పు కోవడానికి సిగ్గుచేటు.. ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరుకావడానికి వేల కార్ల కాన్వాయ్‌లు ఎందుకు?. ట్యాపింగ్ భాగోతం అందరికీ తెలియజేయడానికి ర్యాలీలు చేస్తున్నారా?. ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కేసీఆర్‌కి తెలియకుండా తెచ్చారా?. ఎవరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారు..అని మరో మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు.
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు,మాజీ సీఎంలు విచారణకు హాజరయ్యారు. మీరు నిజాయితీ పరులైతే ఒక్కరే వచ్చి విచారణకు హాజరైతే బాగుండేది. సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని కేసీఆర్ కూతురు కవితనే చెబుతోంది. ట్యాపింగ్ కేసు లో ఉన్న ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా పారిపోయాడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ నుంచి హార్డ్ డిస్కులు ఎందుకు మాయం అయ్యాయి?. మూసి నదిలో,వికారాబాద్ అడవుల్లో ఎందుకు డిస్కులు దొరికాయి. సిగ్గు లేకుండా భార్యాభర్తల ఫోన్ లు ట్యాప్ చేశారని మంత్రులు సెటైర్లు పేలుస్తున్నారు.
కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే దిష్టిబొమ్మలు కాలబెట్టారు.మరి… ఇజ్రాయిల్ నుండి ఎక్విప్మెంట్ తెచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయించారు. బీఆర్ఎస్ ఓడిపోగానే హార్డ్ డిస్కులు ఎందుకు నాశనం చేసి పడేసారు?. తప్పు చేసినవాళ్లు చంద్రమండలానికి పారిపోయిన లాక్కొని వస్తాం. రాజ్యాంగంపై నమ్మకముంటే కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుకోవాలి. కేసీఆర్ కథలు వెబ్ సిరీస్ తీయవచ్చు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తెలంగాణలో లేకుండా చేస్తారు అని అద్దంకి దయాకర్ అన్నారు.






