టాటా ఉద్యోగులకు శుభవార్త
దేశీయ దిగ్గజ ప్రైవేట్ ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. టాటా స్టీల్ అన్నీ యూనిట్లలో 2020-21 సంవత్సరానికి అర్హత కలిగిన ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద రూ.270.28 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలలో ఒకటిగా టాటా స్టీల్ ప్రసిద్ధి చెందింది. వార్షిక బోనస్ చెల్లింపు కోసం టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక మెమోరాండం ఆఫ్ సెటిల్ మెంట్ పై సంతకాలు జరిగినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.34,920, గరిష్ఠంగా రూ.3,59,029 అందనున్నాయని కంపెనీ వెల్లడించింది. అలాగే జంషెడ్‌పూర్‌లో ఉన్న వివిధ డివిజన్ల ఉద్యోగులకు రూ.158.31 కోట్లు ఇచ్చేందుకు కూడా కంపెనీ సిద్దమైంది.






