అమెరికాను వెనక్కి నెట్టిన భారత్
అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాను భారత్ వెనక్కి నెట్టింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడింది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూరప్, ఉత్తర-దక్షిణ అమెరికా, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ)కి చెందిన 47 దేశాల్లో తయారీకి అనువైన ప్రాంతాలపై నిర్వహించిన అధ్యయం ఆధారంగా ఈ జాబితా రూపొందింది. ఇందులో ఈ ఏడాది అమెరికా మూడో స్థానానికి పడిపోయింది. కెనడా, చెక్ రిపబ్లిక్, ఇండొనేసియా, లిథువేనియా, థాయ్‌లాండ్, మలేసియా, పోలాండ్ దేశాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ రూపొందించిన 2021 అంతర్జాతీయ తయారీ రిస్క్ సూచీ నివేదిక ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే తయారీ హబ్‌గా కంపెనీలు భారత్‌ను ఎంపిక చేసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఈ అధ్యయనం నిదర్శనమని కుష్ మన్ అండ్ వేక్ఫీల్డ్ పేర్కొంది.






