కేన్సర్ ఔషధానికి అమెరికాలో అనుమతి
అమెరికాలో కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల చికిత్సకు వినియోగించే సైక్లోఫాస్పమైడ్ ఇంజెక్షన్‌ను విక్రయించడానికి అరబిందో ఫార్మాకు అనుమతి లభించింది. యూజియూ ఫార్మా స్పెషాలిటీస్‌కు ఈ ఔషధాన్ని 500 ఎంజీ/2.5 ఎంఎల్, 1జీ/5 ఎంఎల్ డోసుల్లో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించింది. మాలిగ్నాంట్ లింఫోమాస్, మల్టిపుల్ మైలోమా, లుకేమియా, మైకోసిస్ ఫంగోయిడ్స్, న్యూరోబ్లాస్టోమా తదితర రకాల కేన్సర్ వ్యాధుల చికిత్సకు దీన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు. ఈ ఔషధంతో అమెరికా మార్కెట్లో అరబిందో ఫార్మా, దాని అనుబంధ కంపెనీలకు 453 ఔషధాలకు అనుమతి లభించినట్లు అరబిందో తెలిపింది. యూజియూ ఫార్మాకు మనదేశంలో ఉన్న యనిట్లో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి త్వరలో అమెరికాలో విడుదల చేస్తామని అరబిందో ఫార్మ వెల్లడించింది. సైక్లోఫాస్పమైడ్ ఇంజెక్షన్ అమెరికాలో ఏటా 175 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1300 కోట్ల) అమ్మకాలు నమోదు చేస్తోంది.






