చిన్న గింజలే కానీ లాభాలు కొండంత.. ఈ గింజలతో అనేక రోగాలకు చెక్!
Halim Seeds: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన ఆహారంలో ‘సూపర్ ఫుడ్స్‘ చేర్చుకోవడం ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, పోషకాహార లోపంతో బాధపడేవారికి ‘హలీమ్ గింజలు’ (గార్డెన్ క్రెస్ సీడ్స్) ఒక అద్భుతమైన వరంగా పనిచేస్తాయి. వీటిని తెలుగులో ‘ఆడాలు’ అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి నువ్వుల వలె ఎరుపు లేదా గోధుమ రంగులో ఉన్నప్పటికీ, పోషకాల విషయంలో మాత్రం నువ్వుల కంటే మిన్నగా ఉంటాయి.
ఖనిజాలు పుష్కలంగా..
హలీమ్ గింజలలో ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల గింజల నుండి సుమారు 435 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో 25 గ్రాముల ప్రోటీన్ తో పాటు, గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా 100 గ్రాములకు 100 మిల్లీగ్రాముల ఐరన్ లభించడం దీని ప్రత్యేకత.
ఇవి కూడా చదవండి
ఆరోగ్య ప్రయోజనాలు..
ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే అధిక పొటాషి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకంగా, యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేసి శరీరాన్ని రక్షిస్తాయి.
ఎలా తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏమిటి?
ఈ గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం అత్యంత శ్రేయస్కరం. వీటిని మజ్జిగలో, నిమ్మరసంలో లేదా లడ్డులు, చట్నీల రూపంలో కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే, గర్భిణీ స్త్రీలు, రక్తం పలచబడే మందులు వాడేవారు, అలర్జీలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. సరైన పద్ధతిలో వీటిని వినియోగించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
