సీఎం విజయ్ సినిమా జన నాయగన్ రిలీజెప్పుడు?
తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన స్టార్ హీరో విజయ్(Vijay) ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నెక్ట్స్ మూవీ జన నాయగన్(Jana Nayagan)పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, కొన్ని సాంకేతిక మరియు రాజకీయ అంశాల కారణంగా సర్టిఫికేట్ జారీ ఆలస్యమైంది. ఇటీవల రివైజింగ్ కమిటీ ఈ సినిమాను వీక్షించగా, తుది సెన్సార్ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ కు క్లియరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇటీవల విజయ్ మరియు నిర్మాత వెంకట నారాయణ(Venkata Narayana) మధ్య కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. సినిమా రిలీజ్‌కు సంబంధించిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా లీక్ కావడంతో డిజిటల్ హక్కుల విలువ భారీగా తగ్గిందని, దాదాపు 50% వరకు ఒప్పందాలు ప్రభావితమయ్యాయని టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ నిర్మాతలకు విజయ్ పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. పొలిటికల్ సక్సెస్‌తో విజయ్ మార్కెట్ మరింత బలపడటంతో థియేట్రికల్ బిజినెస్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
జననాయగన్ రిలీజ్ డేట్ పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే రిలీజ్ డేట్ పోస్టర్‌ను రివీల్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. మే నెలలో ఈ సినిమా థియేటర్లలోకి రానుండగా, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
