TANTEX: అలరించిన పద్యంతో నా ప్రయాణం… ఘనంగా టాంటెక్స్ 223వ సాహితీ సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ సాహిత్య వేదిక ‘’నెల నెలా తెలుగువెన్నెల” 223 వ సాహిత్య సదస్సు 2025 ఫిబ్రవరి నెల 15వ తేదీ ఆదివారంనాడు డాలస్ టెక్సాస్ నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా అద్భుతంగా జరిగింది. ’పద్యంతో నా ప్రయాణం‘’ అంశంపై ముఖ్య అతిథి శ్రీ త్యాగరాజు ఎల్లంరాజుగారి ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమ నిర్వహణ తనకెంతో తృప్తి నివ్వడమే కాక, ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి తన ప్రసంగములో నరసరావుపేలో మ్యాథ్స్, సైన్స్ టీచర్ గా పనిచేసి 2020 లో రిటైర్ అయినా భాషలు,కళలు అంటే చిన్నప్పటి నుండి ఉన్న మక్కువతో సాంఘిక నాటికలు నాటకాల్లో, పౌరాణికాల్లో నటునిగా, ఏకపాత్రాభినయం, బుర్రకథ, హరికథ మొదలయిన రంగాల్లో కృషి చేసానని చెప్పారు. అజంత భాష అయిన తెలుగుకే పరిమితమయిన పద్యం మరియు అవధాన విశిష్ట ప్రక్రియలు మాధుర్య గాంభీర్యములతో మనని తరాలుగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సంగీతం ప్రత్యేకంగా నేర్చుకోలేదు కానీ అనుభవం రీత్యా రాగ స్వభావ జ్ఞానం,స్వరపరచి ఆలపించే అనుభవం ప్రాప్తించాయి. ఈ అనుభవంలో భాగంగా కరుణశ్రీ గారి తపోభంగము లోని కొన్ని పద్యాలకి అలాగే వారి అబ్బాయి బాపూజీ గారి భరతధీర శతకం లోని కొన్ని పద్యాలకి తను కట్టిన బాణీ లో మధ్యమావతి, బృందావన సారంగ రాగాల్లో పాడి అలరించారు. అలాగే శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర శతకం లోని కొన్ని పద్యాలను ఆభేరి, రేవతి, పీలు, సింధుబైరవి రాగాల్లో తను కట్టిన బాణిల్లో రాగయుక్తంగా పాడి అందరినీ భక్తి పారవశ్యంలో ముంచారు.

రాథా కాశీనాథుని గారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం లోని కొన్ని పద్యాలను తన పద్య సౌగంధం శీర్షికలో పాడి అవి తనకెందుకు ఇష్టమో వివరించారు. లెనిన్ వేముల నన్నెచోడమహాకవి, కుమారసంభవము లో రాసిన చతుర్విద గర్భ కంద పద్యాన్ని వివరించారు. సాహితీప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 90 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి ధారావాహిక”మనతెలుగుసిరిసంపదలు”కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పర్వదినమయినా సరే సభకి స్థానిక సాహితీ మిత్రులు ప్రత్యక్షంగానూ మరియు జూం లోనూ పెద్ద సంఖ్యలో పాల్గొని సభని జయప్రదం చేసారు.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమంలో సంస్థ పూర్వాధ్యక్షులు ప్రసాద్ తోటకూర, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, నరసింహారెడ్డి ఊరిమిండి, సతీష్ బండారు, చినసత్యం వీర్నపు, ఆనంద మూర్తి కూచిభొట్ల, లలితా మూర్తి కూచిభొట్ల మరియు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు సునీల్ సూరపరాజు, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ పాల్గొన్నారు.
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తరపున శ్రీ దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథికి సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది.వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.
ఇవి కూడా చదవండి