రవి అడుసుమిల్లి ఆధ్వర్యంలో ఘనంగా జిడబ్ల్యుటీసిఎస్ ఉగాది వేడుకలు
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది పెద్దలు, చిన్నారులు, మహిళల సందడితో.. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.. ముఖ్యంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, యుగళ గీతాలు, నృత్య ప్రదర్శనలతో పాటు, సినీ రచయితా అనంత్ శ్రీరామ్ గారి సారథ్యంలో సంగీతం, సాహిత్యం, హాస్యం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా అన్ని వయసుల తెలుగు వారందరినీ ఆకట్టుకుందనీ సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి తెలిపారు. నాలుగు గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమాలు రాత్రి 1 గంట వరకూ నిరంతరంగా సాగాయి.. రక రకాల వేష ధారణతో..చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్ని తరాల వారిని ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో పసందైన విందును సభికులకు అందించారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ.. ఎల్లలు లేనిది మన మాతృబాష తెలుగు .. అనాదిగా తెలుగు బాష వైభవం, కళా, సంస్కృతీ సంప్రదాయాలను సరిహద్దులను దాటించి ఈనాడు లక్షలాది మంది తెలుగు వారు నివసిస్తున్న ఉత్తర అమెరికాలో రాజధాని ప్రాంత వేదికగా ప్రతి తెలుగింటి పండుగను జరుపుకుంటూ.. ప్రాముఖ్యతను చాటుతూ.. అన్ని తరాల వారిని అలరిస్తూ, తెలుగు భాషను సజీవంగా నిలబెడుతున్న వేదికలు, సంఘాలలో అగ్ర తాంబూలం బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘానికి దక్కుతుంది..స్వర్ణోత్సవాలను జరుపుకున్న ఈ సంస్థ, యువ వారసత్వంతో మరో స్వర్ణోత్సవ కాలం పాటు ఈ పరంపరను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు ఇతోధికంగా సహకరిస్తున్న దాతలను, యువ వాలంటీర్లను అభినందించారు.
ముఖ్య అతిధిగా హాజరైన, చింతలపూడి శాసన సభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ప్రవాస సంస్థగా ఇంతింతై అటుడింతై అన్నట్లు ఎదిగి ఎన్నో ప్రవాస సంఘాలకు బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆదర్శంగా, మూలంగా నిలిచింది. ఈతరం చిన్నారులకు మనదైన సంస్కృతీ సంప్రదాయాలను అందించే ఈ వేదిక చిరకాలం నిలవాలని, హాజరైన వందలాది మంది తెలుగింటి మహిళలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మాతృభూమి, మాతృబాష రెండు కళ్లుగా భావిస్తూ, ఏ దేశమేగినా మన కట్టు, బొట్టు, , మూలలను మర్చిపోకుండా, మన సంస్కృతిని కాపాడుకుంటూ, వృత్తి ఉపాధి, వ్యాపార రీత్యా రాణిస్తున్న ప్రవాస తెలుగు వారందరినీ అభినందించారు.
పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు, కృష్ణ లాం, సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసారనేని, యశస్వి బొద్దులూరి, భానుప్రకాష్ మాగులూరి, గంగ శ్రీనివాస్, విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, పద్మజ బేవర , శ్రీవిద్య సోమ, పావని తదితరులు.. సభికులకు ధన్యవాదములు తెలిపి.. బాషా, సంస్కృతీ ని కాపాడుకోవటం, కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని తెలిపారు.
ఇవి కూడా చదవండి
