Tollywood: తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే ఛాన్స్ ఉందా..?

తెలుగు సినీ పరిశ్రమకు (Telugu Cinema Industry) దాదాపు 75 ఏళ్ల చరిత్ర ఉంది. దేశమే కాదు.. ప్రపంచం గర్విచదగ్గ సినిమాలను తీసింది టాలీవుడ్ (Tollywood). ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఎంతోమంది దిగ్గజ నటులు తెలుగు సినీ పరిశ్రమకు ఆయువుపట్టులా వ్యవహరించారు. మద్రాస్ (Madras) నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అక్కడే సినీ ఇండస్ట్రీ వేళ్లూనుకుపోయింది. అయితే మద్రాస్ నుంచి హైదరాబాద్ (Hyderabad) రావాలన్న ప్రభుత్వాల పిలుపు మేరకు ఇండస్ట్రీ తరలివచ్చింది. ఇప్పుడు దేశంలోనే హైదరాబాద్ సినీ స్వర్గధామంగా పేరొందింది. పేరెన్నికగన్న సినిమా స్టూడియోలు ఇక్కడ ఏర్పడ్డాయి. ఎంతోమంది హీరోలు, నటులు ఇక్కడ కొలువుదీరారు. అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు తరలిపోనుందనే వార్త హల్ చల్ చేస్తోంది.
తెలంగాణలో (Telangana) అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest) తర్వాత సినీ పరిశ్రమలో ఒకింత భయం ఆవహించింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి (CM Revanth Reddy) అయ్యాక కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. సినీ పరిశ్రమ గత పదేళ్లూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాసుకుపూసుకు తిరిగింది. దీన్ని రేవంత్ రెడ్డి మనసులో పెట్టుకున్నారో ఏమో.. వాళ్లతో కాస్త కటువుగానే ప్రవర్తిస్తున్నారు. గద్దర్ పేరిట అవార్డులు (Gaddar Awards) ఇస్తామని రేవంత్ ప్రకటిస్తే ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. దీనిపై రేవంత్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు టాలీవుడ్ కలిసి రావాలని కోరారు. దాన్ని కూడా కాస్త గట్టిగానే హెచ్చరించారు. అనంతరం హైడ్రాలో భాగంగా నాగర్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ (Nagarjuna N-Convention) ను కూల్చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు.
అల్లు అర్జున్ ను అరెస్టు చేయాల్సింది కాదని.. రేవంత్ రెడ్డి కావాలనే అరెస్టు చేయించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే తాము చట్టప్రకారమే నడుచుకున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. పుష్ప 2 (Pushpa-2) సినిమాకు టికెట్లు రేట్లు (Ticket Rates hike) పెంచింది మేమేనని.. బెనిఫిట్ షోలకు (benefit Shows) అనుమతులిచ్చింది తామేనని గుర్తు చేస్తున్నారు. ఇండస్ట్రీ అడిగవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాక సినీ పరిశ్రమకు స్థలాలిచ్చి ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఎవరిపైన తమకు కక్షగట్టాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్న మాట.
వాస్తవానికి తెలుగు సినీ ప్రముఖులకు కూడా హైదరాబాద్ ను వదిలి వెళ్లాలనే ఆలోచన ఏమాత్రం లేదు. హైదరాబాద్ లో ఉన్నన్ని సౌకర్యాలు ఏపీలో పొరపాటున కూడా లేవు. అక్కడ ఈ స్థాయిలో సినీ పరిశ్రమ అబివృద్ధి జరుగుతుందని కూడా ఆశించలేం. ఒకే భాషకు సంబంధించిన సినిమాలకు రెండు కేంద్రాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే హైదరాబాద్ నుంచి తరలివచ్చేయాలని వాళ్లు కూడా కోరుకోవట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైనా, నష్టమైనా హైదరాబాద్ వదిలి వెళ్లే పరిస్థితి సినీ ఇండస్ట్రీకి కూడా లేదు. కాబట్టి టాలీవుడ్ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిపోతుందనేది ఒట్టి మాటే.