సెన్సార్ పూర్తి చేసుకున్న ధనుష్ సినిమా.. రన్ టైమ్ ఎంతంటే?
తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విఘ్నేష్ రాజా(Vignesh Raja) తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ డ్రామా కర(Kara) విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుండగా, ప్రమోషన్స్‌తో మూవీకి మంచి హైప్ దక్కింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత బలంగా కనిపిస్తున్నాయి. మమిత బైజు(Mamitha Baiju) హీరోయిన్గా నటిస్తుండటం కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.
తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రానికి సుమారు 2 గంటల 41 నిమిషాల నిడివి ఉండనుంది. సాధారణంగా ఈ స్థాయి రన్‌టైమ్ ఉన్న సినిమాల విషయంలో ఆడియన్స్ కాస్త అప్రమత్తంగా ఉంటారు. అయితే, ఈ చిత్రంలో కథనం ఎక్కడా నెమ్మదించకుండా, ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా మలిచినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది. థ్రిల్లింగ్ అంశాలు, కథలో ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(G. V. Prakash Kumar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రత్యేక బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్(vels film international) బ్యానర్‌పై ఇషారి కె. గణేష్(Ishari K. Ganesh) నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ప్రస్తుతం మోస్తరు అంచనాలు ఉన్నప్పటికీ, రిలీజ్ తర్వాత వచ్చే మౌత్ టాక్ ఈ సినిమాకు కీలకంగా మారే అవకాశం ఉంది. థియేటర్లలో ఈ చిత్రం ఎలాంటి స్పందనను రాబడుతుందో చూడాలి.
