బ్యాంకు ఖాతాలో డబ్బులు దాస్తున్నారా? అయితే మీరు నష్టపోయినట్లే!
Savings Account: మనలో చాలామంది డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచితేనే సురక్షితం అనుకుంటారు. కానీ, పెరిగే ధరలను గమనిస్తే ఇది అంత తెలివైన పని కాదు. ప్రస్తుతం బ్యాంకులు ఇచ్చే వడ్డీ కంటే వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల మీ అకౌంట్లో డబ్బు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, దాని కొనుగోలు శక్తి మాత్రం తగ్గిపోతోంది.
వడ్డీ తక్కువ ..ధరలు ఎక్కువ..
ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌పై కేవలం 3 శాతం వరకు మాత్రమే వడ్డీ ఇస్తున్నాయి. కానీ, బయట వస్తువుల ధరలు (ద్రవ్యోల్బణం) 5 శాతానికి పైగా పెరుగుతున్నాయి. అంటే, మీకు వచ్చే వడ్డీ కంటే ధరల పెరుగుదలే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు, బ్యాంకు మీకు రూ. 3 లాభం ఇస్తుంటే, వస్తువుల ధరలు రూ. 5 పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు తెలియకుండానే నష్టపోతున్నారు.
డబ్బును పెంచే మార్గాలు..
అవసరానికి మించి నగదును అకౌంట్లో ఖాళీగా ఉంచే బదులు ఈ పద్ధతులు పాటించవచ్చు.
స్వీప్-ఇన్ ఎఫ్డీ: మీ బ్యాంకు ఖాతాలో నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ డబ్బు ఉంటే, అది ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కింద మారిపోతుంది. దీనివల్ల ఎక్కువ వడ్డీ వస్తుంది, అలాగే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
లిక్విడ్ ఫండ్స్: ఇవి సేవింగ్స్ అకౌంట్ కంటే మెరుగైన రిటర్న్స్ ఇస్తాయి. అత్యవసర సమయంలో వెంటనే డబ్బు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.
పొదుపు ..
మీ నెలవారీ ఖర్చులకు, అత్యవసర అవసరాలకు కావాల్సినంత డబ్బును మాత్రమే సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోండి. మిగిలిన మొత్తాన్ని పైన చెప్పిన మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. కేవలం బ్యాంకులో డబ్బును దాచడం వల్ల మీ సంపద పెరగదు.ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేసినప్పుడే మీ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది.
