మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. రాజీనామా చేస్తే కళ్లు చెదిరే గిఫ్ట్స్.. సూపర్ ప్యాకేజీ!
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన 50 ఏళ్ల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ రంగంలో వస్తున్న పెను మార్పులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెట్టుబడుల నేపథ్యంలో ఖర్చులను బ్యాలెన్స్ చేసుకునేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి తెరతీసింది. అమెరికాలో పనిచేస్తున్న తమ దీర్ఘకాలిక ఉద్యోగుల కోసం అత్యంత ఆకర్షణీయమైన ‘ఎగ్జిట్ ప్యాకేజ్’ను ప్రకటించి ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అర్హులు ఎవరు? కండిషన్స్ ఏంటి?
మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రకటించిన ఈ గోల్డెన్ ఆఫర్ అందరికీ వర్తించదు. ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఉద్యోగి వయస్సు, అలాగే వారు మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన మొత్తం సంవత్సరాలు.. ఈ రెండూ కలిపితే 70 ఏళ్లు దాటి ఉండాలి. నివేదికల ప్రకారం, సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మంది (అంటే సుమారు 8,750 మంది ఉద్యోగులు) ఈ ప్రత్యేక పథకానికి అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఏకంగా 900 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 7,500 కోట్లకు పైగానే) భారీ వ్యయాన్ని భరించడానికి సిద్ధమైంది.
ప్యాకేజీలో హైలైట్స్ ఇవే..
ఎవరైతే ముందుకొచ్చి స్వచ్ఛందంగా తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తారో వారికి నగదు, స్టాక్ ఆప్షన్లతో పాటు కళ్లుచెదిరే ఆరోగ్య ప్రయోజనాలను కంపెనీ (Microsoft) కల్పిస్తోంది.
హెల్త్ కేర్ కవరేజ్: ఈ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణ ఐదేళ్ల సుదీర్ఘ ఆరోగ్య సంరక్షణ. రాజీనామా చేసిన మొదటి ఏడాది పాటు ఉద్యోగికి మెడికల్, డెంటల్, ఐ కేర్ ఖర్చులను పూర్తిగా కంపెనీనే భరిస్తుంది. ఆ తర్వాతి నాలుగేళ్ల పాటు ఉద్యోగులు స్వయంగా తమ ప్రీమియంలు చెల్లిస్తూ అదే కార్పొరేట్ కవరేజ్‌ను కొనసాగించుకునే వెసులుబాటును ఇచ్చింది.
భారీగా నగదు: ఉద్యోగి హోదా, సర్వీస్ కాలాన్ని బట్టి ఒకేసారి భారీ మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజీని చెల్లించనున్నారు. మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు గరిష్టంగా 39 వారాల జీతాన్ని (దాదాపు 9 నెలల వేతనం) ఒకేసారి ఇచ్చే అవకాశం ఉంది.
స్టాక్స్ ప్రయోజనాలు: నగదుతో పాటు సంస్థకు (Microsoft) చెందిన స్టాక్ ప్రయోజనాలను కూడా ఉద్యోగులు సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించింది.
రాబోయేది లేఆఫ్స్ సునామీ!
ఈ గోల్డెన్ ప్యాకేజీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నా, దీని వెనుక ఒక చేదు వాస్తవం కూడా దాగి ఉంది. ఏఐ (AI) టెక్నాలజీపై భారీ ఎత్తున నిధులు కుమ్మరిస్తున్న మైక్రోసాఫ్ట్ (Microsoft).. ఆ ఖర్చుల నియంత్రణలో భాగంగా త్వరలోనే భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు ప్లాన్ చేస్తోంది. అకస్మాత్తుగా బలవంతంగా ఉద్యోగంలో నుంచి పీకేయడం కంటే, ఇలా ఒక ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీ ఇచ్చి గౌరవప్రదంగా సాగనంపడమే సంస్థ ప్రతిష్టకు మంచిదనే ఉద్దేశ్యంతోనే మైక్రోసాఫ్ట్ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
