అమెరికాలో మరో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన
అమెరికాలో మరో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన జరిగింది. తనకు పక్షవాతం ఉందని, కారు దిగలేమని చెప్పినా వినకుండా పోలీసులు ఓ నల్లజాతీయుడిని గల్లా పట్టి గుంజి జుట్టు పట్టి లాగి కిందకు ఈడ్చేశారు. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ లో గత నెల 30న జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో మొత్తం పోలీసుల బాడీ క్యామ్ లో రికార్డ్ అయింది. క్లిఫర్డ్ ఒవెన్స్ బై అనే నల్లజాతీయుడు తన కార్లో ఇంటికి వెళ్తుండగా డేటన్ పోలీసులు ఆపారు. డ్రగ్స్ తనిఖీలు చేయాలని, కారు దిగాలని పోలీసులు క్లిఫర్డ్ను ఆదేశించారు. అయితే, అందుకు నిరాకరించిన క్లిఫర్డ్ తనకు పక్షవాతం ఉందని, వారు దిగలేనని తెలిపారు. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించారు.
అయితే అతడి మాటలను ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు పదే పదే కారు దిగాలని ఒత్తిడి తెచ్చారు. సహనం కోల్పోయిన పోలీసులు అతడిని జుట్టు పట్టి బయటకు లాగేశారు. కిందపడేసి చేతులు కట్టేశారు. తర్వాత కారును చెక్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తనిఖీల్లో 22,450 డాలర్ల సొమ్ము తప్ప డ్రగ్స్ ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పడం వివాదాస్పదమైంది. పోలీసుల చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు పోలీసులుపై దర్యాప్తునకు ఆదేశించారు.






