H1B Visa: ‘నాలెడ్జ్ ట్రాన్స్ఫర్’ కోసమే విదేశీ నిపుణులు.. ట్రంప్ కొత్త విధానమిదే!
హెచ్1బీ వీసాలపై (H1B Visa) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విధానాన్ని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బీసెంట్ (Scott Bessent) వివరించారు. ఈ వీసాలు కేవలం ‘నాలెడ్జ్ ట్రాన్స్ఫర్’ (జ్ఞాన బదిలీ) కోసమే ఉపయోగించాలనేది ట్రంప్ ఆలోచన అని ఆయన తెలిపారు. సుదీర్ఘకాలం విదేశీయులపై ఆధారపడకుండా, స్వల్పకాలంలో అమెరికన్ పౌరుల నైపుణ్యాలను పెంచడమే లక్ష్యమని ఆయన (Scott Bessent) పేర్కొన్నారు.
ఉత్పత్తి రంగాన్ని అమెరికాలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు బీసెంట్ చెప్పారు. “సెమీకండక్టర్ పరిశ్రమను తిరిగి యూఎస్‌కు తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. దీనికోసం నైపుణ్యాలున్న విదేశీయులను ఒక 5-7 ఏళ్ల కోసం యూఎస్‌కు తీసుకొచ్చి, మనవాళ్లకు శిక్షణ ఇప్పించాలనేది అధ్యక్షుడి ఆలోచన. ఆ తర్వాత విదేశీయులు తమ దేశం వెళ్లిపోతే, మనవాళ్లు ఆ పని చేయగలుగుతారు,” అని బీసెంట్ (Scott Bessent) వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా అమెరికన్లకు హై-స్కిల్డ్ జాబ్స్ కోసం శిక్షణ ఇప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారని ఆయన వివరించారు.





