Colombia: నేను మదురోను కాదన్న గుస్తావో.. కొలంబియా అధ్యక్షుడితో చర్చలకు సిద్ధమన్న ట్రంప్..!
ఇది వెనెజువెలా కాదు..నేను మదురోను కాదు.. ఏయ్ ట్రంప్ .. దమ్ముంటే నన్ను పట్టుకెళ్లు.. ఆక్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను.. ఇదీ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో సంచలన ప్రకటన. నేరుగా అమెరికాకే సవాల్ చేశాడు గుస్తావో. ఇది లాటిన్ అమెరికా దేశాలను సైతం నిర్ఘాంత పరిచింది. ఎందుకంటే.. సేమ్ సవాల్ చేసిన వెనెజువెలా అధ్యక్షుడిని ట్రంప్ సైన్యం ఎత్తుకెళ్లింది. అలాంటప్పుడు నోరుమూసుకుని గప్ చుప్ మని ఉండకుండా.. ఇదేం ప్రకటన అన్న భయాలు సైతం ఆయా దేశాల్లో కనిపించాయి. అయితే గుస్తావో మాత్రం .. నేను గొరిల్లా ఫైటర్ ను అన్న విషయాన్ని ట్రంప్ కు గుర్తు చేశారు.
‘‘నేను ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.
నికోలస్ మదురో నిర్బంధం తర్వాత లాటిన్ అమెరికాలోని మెక్సికో, క్యూబా, కొలంబియాలను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. అయితే, ఈ విషయంలో ట్రంప్ తాజాగా తన స్వరాన్ని మార్చారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు (Trump- Gustavo Petro).
గుస్తావోతో స్నేహపూర్వకమైన ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ (Donald Trump) ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. మాదక ద్రవ్యాలు, ఇతర విభేదాల గురించి తాము చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా త్వరలోనే గుస్తావో (Gustavo Petro)తో భేటీ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఈ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఇక, మదురో నిర్బంధం తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా సైతం మాదక ద్రవ్యాలు తయారుచేసి అమెరికాకు తరలిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే వెనెజువెలా లాంటి పరిస్థితినే వీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. ఈ హెచ్చరికలపై గుస్తావో కూడా తీవ్రంగా స్పందించారు. ‘నన్ను తీసుకెళ్లండి. ఇక్కడే మీకోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సవాల్ విసిరారు. తమ దేశంపై యూఎస్ సైనిక చర్య చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్‌గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.






