India-US: ట్రంప్ తో మోడీ డైరెక్టుగా మాట్లాడాలి.. అప్పుడే డీల్ స్పీడవుతుందన్న అమెరికా మంత్రి..!
భారత్-అమెరికా మధ్య డీల్ చాలా ఆలస్యమవుతోంది. ఆతర్వాత అమెరికాతో పలుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కూడా. కానీ భారత్ తో మాత్రం ఒప్పందం ఆలస్యమవుతోంది. దీనికి విధానపరమైన కారణాలతో ఇబ్బందులున్నాయని ఊహాగానాలు చెలరేగాయి. ఓవైపు పీయూష్ గోయల్.. తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు విదేశాంగమంత్రి జైశంకర్ కూడా… తనవంతు పాత్ర పోషిస్తున్నారు. కానీ .. డీల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది. దీనికి కారణం.. తాము కాదంటోంది అమెరికా.
భారత్-అమెరికా ట్రేడ్‌డీల్ చర్చల వేళ అమెరికా వాణిజ్యమంత్రి హొవార్డ్ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు (India-US trade deal). ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోడీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని వెల్లడించారు (Trump-Modi).
‘‘మామూలుగా అయితే ఒప్పందం కొలిక్కి వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే.. ఇది ట్రంప్ ఒప్పందం. దానికి ముగింపు రావాలంటే.. ట్రంప్‌నకు మోడీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి ఇది రుచించలేదు. మోడీ చివరివరకు ఫోన్ చేయలేదు. మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్‌తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు మేం ఆలోచించడం లేదు.
బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తోన్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్స్టార్మర్ ట్రంప్‌నకు కాల్ చేశారు (Donald Trump). ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాతి రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు’’ అంటూ భారత్, బ్రిటన్ మధ్య పోలిక తెచ్చారు. మోడీ (PM Modi) ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ.. ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఒకవైపు ట్రేడ్ డీల్ చర్చలు జరుపుతూనే.. భారత్‌పై అమెరికా (USA) సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేలా 500 శాతం సుంకాలు విధించే బిల్లును తేవడానికి ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.






