Janga Krishnamurthy: తిరుమల భూవివాదం.. టీటీడీ సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి సభ్యుడు, సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూకేటాయింపు వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, కేబినెట్ సమావేశంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇటీవల ఓ దినపత్రికలో తనపై వచ్చిన కథనాలపై ముఖ్యమంత్రి వాస్తవాలను పరిశీలించకుండానే, టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామని కేబినెట్ మీటింగ్లో ప్రకటించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ వివాదానికి మూలాలు దాదాపు రెండు దశాబ్దాల క్రితం నాటివి. పల్నాడు జిల్లాకు చెందిన బలమైన బీసీ నాయకుడైన జంగా కృష్ణమూర్తి, 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల బాలాజీ నగర్లో ఒక ప్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ‘కాటేజీ డొనేషన్ స్కీమ్’ కింద ప్లాట్ నంబర్ 2ను ఆయనకు కేటాయించినప్పటికీ, డొనేషన్ మొత్తం పది లక్షల నుంచి యాభై లక్షలకు పెరగడంతో ఆయన ఆ సొమ్ము చెల్లించలేదు. ఫలితంగా ఆ కేటాయింపు రద్దయింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మళ్ళీ ప్రయత్నించగా, టీటీడీ కోటి పది లక్షలు చెల్లించాలని కోరింది. అయితే ఆ స్థలాన్ని తన వ్యక్తిగత పేరు మీద కాకుండా ‘ఓం శ్రీ నమో వేంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్’ పేరు మీదకు మార్చాలని ఆయన కోరారు. నిబంధనల సాకుతో అప్పట్లో ఆ అభ్యర్థన తిరస్కరణకు గురైంది.
అయితే, ఎన్నికల ముందు టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తికి కూటమి ప్రభుత్వం టీటీడీ బోర్డులో చోటు కల్పించింది. బోర్డు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తన పాత అభ్యర్థనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో, ప్రస్తుతం ఆ స్థలం మార్కెట్ విలువ దాదాపు 7 కోట్ల రూపాయల పైచిలుకు ఉన్నప్పటికీ, పాత ధరకే అంటే కేవలం కోటి పది లక్షలకే ఆయన ట్రస్టుకు కేటాయిస్తూ బోర్డు తీర్మానం చేసింది. ఈ నిర్ణయం బయటకు రావడంతో పెను దుమారం రేగింది. ప్రభుత్వం పారదర్శకత గురించి మాట్లాడుతుంటే, బోర్డు సభ్యులు మాత్రం తమ సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయల విలువైన టీటీడీ ఆస్తులను తక్కువ ధరకు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు సభ్యులుగా ఉండి ఇలాంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీంతో అడ్డగోలుగా జరిగిన ఈ భూకేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనను వ్యక్తిగతంగా అవమానించినట్లుగా ఉందని జంగా కృష్ణమూర్తి భావించారు. తాను భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ ద్వారా సేవ చేయాలనుకున్నానని, కానీ తనపై అసత్య కథనాలు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ తీసుకోకుండానే రద్దు నిర్ణయం ప్రకటించడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతిందని పేర్కొంటూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.






