Pawan Kalyan: కూటమి ఐక్యతే లక్ష్యం..గ్రౌండ్ లెవెల్‌కు పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలు..
ఏపీలో (Andhra Pradesh) 2024 ఎన్నికల సమయంలో టీడీపీ(TDP) –జనసేన (Janasena) –బీజేపీ (BJP) కూటమి ఏర్పాటుకు వెనక ప్రధాన పాత్ర పోషించినది జనసేన అన్నది రాజకీయ వర్గాల్లో అందరూ ఒప్పుకునే విషయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 2022లో ఇప్పటం (Ippatam)లో జరిగిన పార్టీ సభలో ఇచ్చిన పిలుపు ఈ ప్రయాణానికి ఆరంభంగా మారింది. అప్పుడే ఆయన విభిన్న రాజకీయ శక్తులు ఒక్కటై ప్రజల కోసం ముందుకు రావాలన్నారు. జనతా ప్రయోగాన్ని ఉదహరిస్తూ, ఐక్యతే మార్గమని చెప్పారు. ఆ ఆలోచన 2023 తర్వాత క్రమంగా సానుకూల దిశలో నడిచింది. పూర్తి రూపం దాల్చడానికి 2024 ప్రారంభం వరకు సమయం పట్టినా, చివరకు కూటమి బలంగా నిలిచింది.
ఈ క్రమంలో టీడీపీ , బీజేపీ మధ్య అనుసంధానంగా జనసేన కీలకంగా వ్యవహరించింది. పొత్తు కుదరడానికి అవసరమైన విశ్వాసం, సమన్వయం ఏర్పడేలా చేసింది. ఫలితం 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కూటమికి ఎన్నడూ లేనంత విజయం దక్కింది. ప్రతిపక్షంగా మారిన వైసీపీ (YSR Congress Party) కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఇది ప్రజల్లో కూటమిపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా భావిస్తున్నారు.
ఈ విజయాల మధ్య కూడా పవన్ కళ్యాణ్ తరచుగా ఒక హెచ్చరిక చేస్తూ వస్తున్నారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని, చిన్న చిన్న విభేదాలతో పెద్ద లక్ష్యాన్ని దెబ్బతీయవద్దని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు, దీర్ఘకాలం పాటు కూటమి అధికారంలో కొనసాగాలని, అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని తన ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. తాజాగా పిఠాపురం (Pithapuram)లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా ఆయన ఇదే అంశాన్ని మరోసారి గుర్తు చేశారు. ఎంతో కష్టపడి ఏర్పడిన కూటమిని బలహీనపర్చే ప్రయత్నాలు చేయవద్దన్నారు. కలిపి ఉంచడం కష్టమని, విడదీయడం మాత్రం సులభమని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారన్నదే ఇప్పుడు చర్చగా మారింది.
విపక్షంగా ఉన్న పార్టీలు అధికార పక్షం బలహీనపడాలని కోరుకోవడం రాజకీయంగా సహజమే. కాబట్టి పవన్ సూచనలు వారి కోసం కాదని చాలామంది భావిస్తున్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల మధ్య పై స్థాయిలో సఖ్యత ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో అదే స్థాయి సమన్వయం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా అధిక్యత, హవా చూపాలన్న ప్రయత్నాలు ఐక్యతకు ముప్పుగా మారవచ్చన్న ఆందోళన ఉంది. అందుకే పవన్ చేసిన వ్యాఖ్యలు కిందిస్థాయి కార్యకర్తలు, నేతలను ఉద్దేశించినవేనని విశ్లేషకులు చెబుతున్నారు. అందరూ కలిసి నడిచినప్పుడే 2024లో వచ్చిన ఫలితాలు మళ్లీ 2029లో కూడా రిపీట్ అవుతాయని వారి అభిప్రాయం. పై స్థాయిలో నాయకత్వాలు ఇందుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక ముందు గ్రౌండ్ లెవెల్లో ఐక్యత ఎంత బలంగా నిలుస్తుందోనే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.






