Thummalapalli Ramasatyanarayana: మరో చరిత్ర సృష్టించిన శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ
ఒకే రోజు 7 సినిమాల ట్రైలర్స్ విడుదల
త్వరలో మిగతా 8 చిత్రాల ట్రైలర్స్
20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… గతేడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభించి… ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. ఇప్పుడు ఆ 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించి తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకున్నారు.
భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాణమవుతూ ట్రైలర్స్ విడుదల జరుపుకున్న ఆ ఏడు చిత్రాలు… ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో “మహానాగ”, రవి బాసర దర్శకత్వంలో “యండమూరి కథలు”, విజయ్ ఎర్రంశెట్టి దర్శకత్వంలో “మా నాన్న హీరో”, నూతన్ దర్శకత్వంలో “రోబో-47”, “మహాబలుడు”, హర్ష దర్శకత్వంలో “రుద్రతాండవం”, సాయి రమేష్ దర్శకత్వంలో “మనం-2036” చిత్రాల ట్రైలర్స్ విడుదల వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత కోలాహలంగా జరిగిన ఈ వేడుకలో సుమన్, సాయికుమార్, వి.విజయేంద్రప్రసాద్, కె.ఎస్.రామారావు, రేలంగి నరసింహారావు, యండమూరి వీరేంద్రనాధ్, జె.కె.భారవి, వీరశంకర్, చంద్రమహేష్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, టి.ప్రసన్నకుమార్, కె.అశోక్ కుమార్, కవిత, కల్వ సుజాత గుప్త, వి విజయ్ కుమార్ వంటి అతిరథమహారధులు అతిథులుగా పాల్గొని ఆయా చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 15 చిత్రాలకు సంగీత సారధ్యం వహిస్తున్న సంగీత దర్శకద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి – డా. వి.ఆర్.ఎ. ప్రదీప్, ఈ చిత్రాలు అన్నిటికీ పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న పి.ఆర్.ఓ. ధీరజ అప్పాజీ, క్రియేటివ్ హెడ్ తల్లాడ సాయికృష్ణలతోపాటు… 7 చిత్రాల దర్శకులను… ముఖ్య అతిధుల చేతుల మీదుగా సత్కరించారు. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న 15 చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.
పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రికార్డు స్థాయిలో షూటింగ్ పూర్తి చేసి, ట్రైలర్స్ సిద్ధం చేసిన దర్శకులలో మరింత ఉత్సాహం నింపేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, త్వరలో ఒక్కో చిత్రం విడుదల తేది ప్రకటిస్తామని, మిగతా 8 చిత్రాల ట్రైలర్స్ త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ 15 చిత్రాలు ఇదే సంవత్సరం ఆగస్టులోపు విడుదల చేసి, ఆ విధంగానూ రికార్డ్ క్రియేట్ చేస్తామని నిర్మాత తుమ్మలపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు!!






