Trump Tariffs: చైనా, భారత్ లపై 500శాతం టారిఫ్ లు… ట్రంప్ మరో కీలక నిర్ణయం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబ్ సిద్ధం చేశారు. వచ్చేవారమే అది పేలనుంది. ఆ బాంబ్.. చైనా, భారత్ లలో ప్రకంపనలు సృష్టించనుందని చెప్పవచ్చు. అదే టారిఫ్ బాంబ్. ఇప్పటివరకూ భారత్ పై 50శాతం టారిఫ్ లతో సరిపుచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా 500 శాతం టారిఫ్ విధించేందుకు సిద్ధమయ్యారు. ఇది కనుక ఆమోదం పొందితే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది.
ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించేందుకు ట్రంప్‌నకు అధికారం లభిస్తుంది (Trump Tariffs). ఈ బిల్లుకు సంబంధించి రిపబ్లికన్ సెనెటర్ లిండ్జీ గ్రాహమ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది.
ట్రంప్ (Donald Trump)తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహమ్ తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి చమురు (Russia oil) కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తోన్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని గ్రాహమ్ ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు మాస్కో చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు వేసే అధికారం యూఎస్‌కు లభిస్తుందన్నారు. ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకుసాగుతామని తెలిపారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహమ్ మండిపడ్డారు.
రష్యా చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదటినుంచి ఆగ్రహంతో ఉన్నారు. ఈ కారణంతోనే గతేడాది భారత దిగుమతులపై ట్రంప్ అదనపు సుంకాలు విధించడంతో మొత్తం టారిఫ్‌లు 50 శాతానికి (Trump Tariffs On India) చేరాయి. మరోవైపు.. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్- అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల వేళ కీలక బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.






