Nicolas Maduro Case: ఎవరీ అల్విన్.. ట్రెండింగ్ లో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి పేరు..!
మన్ హట్టన్ ఫెడరల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో దంపతులు. ఈ కేసును విచారించిన మన్హటన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అల్విన్ హెల్లర్‌స్టీన్ (US judge Alvin Hellerstein) వయసు 92 ఏళ్లు. ఎన్నో కీలక కేసుల్ని విచారణ జరిపి.. కీలక తీర్పులిచ్చారు అల్విన్.
అల్విన్ ప్రస్థానం..
అల్విన్ హెల్లర్‌స్టీన్ 1933లో న్యూయార్క్‌లో జన్మించారు. కొలంబియా యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. తొలినాళ్లలో అమెరికా ఆర్మీలో లాయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రైవేటుగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1998లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. అల్విన్‌ను న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా నామినేట్ చేశారు.
9/11 నుంచి ట్రంప్ హష్ మనీ కేసు వరకు..
తన సుదీర్ఘ కెరీర్లో అల్విన్ ఎన్నో సివిల్ కేసుల్లో కీలక తీర్పులిచ్చారు. 2001 సెప్టెంబరులో న్యూయార్క్, వాషింగ్టన్లో జరిగిన అల్‌ఖైదా ఉగ్రదాడుల కేసును విచారించారు. శృంగార తారకు హష్ మనీ కేసు విచారణను ఫెడరల్ కోర్టుకు మార్చాలంటూ అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి వార్తల్లో నిలిచారు. గతేడాది వెనెజువెలా డ్రగ్స్ ముఠా సభ్యులను కోర్టు విచారించకుండా డిపోర్ట్ చేసేందుకు ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసును కూడా గత 15 ఏళ్లుగా విచారిస్తున్నారు. ఇదే కేసులో 2020లోనే మదురోపై అమెరికా అభియోగాలు మోపగా.. ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హ్యుగో ఆర్మాండో ఇప్పటికే దోషిగా తేలారు.
అసాంజేను విడిపించిన లాయర్‌తో..
ఇక, ఈ కేసులో మదురో తరఫున అమెరికాకు చెందిన ప్రముఖ న్యాయవాది బారీ జె.పోలక్ వాదనలు వినిపించనున్నారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తరఫున వాదించి 2024లో ఆయనను జైలు నుంచి విడిపించడంతో పోలక్ పేరు అప్పట్లో మార్మోగింది. తన మూడు దశాబ్దాల కెరీర్లో పోలక్ ఎంతోమంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్, రాజకీయ ప్రముఖుల తరఫున వాదించారు.






