YCP MLAs: అసెంబ్లీకి డుమ్మా.. వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ కొరడా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభకు గైర్హాజరవుతూ, ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయ్యింది. కమిటీ ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగిన తాజా సమావేశం, వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యంపై కీలక చర్చకు దారితీసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరనే సాకుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. అయితే, సభకు రాకపోయినా ప్రజా ధనాన్ని జీతాల రూపంలో తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో ఆరుగురు సభ్యులు అసెంబ్లీకి అసలు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది. మిగిలిన ఐదుగురు సభ్యులు ఏదో ఒక సమయంలో సభకు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంటే, బయటకు బహిష్కరణ అని చెబుతూనే, సాంకేతికంగా పదవిని కాపాడుకోవడానికి, అలవెన్సులు పొందడానికి దొంగచాటు సంతకాల వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సమావేశంలో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు కీలక ప్రతిపాదనలు చేశారు. కేవలం రాజకీయ కారణాలతో సభను బహిష్కరించి, సభా మర్యాదలను ఉల్లంఘించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలకు త్వరలోనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కమిటీ భావిస్తోంది. ఎమ్మెల్యేలను నేరుగా కమిటీ ముందుకు పిలిపించి, గైర్హాజరుపై వారి వెర్షన్ ఏమిటో అడగాలని జ్యోతుల నెహ్రూ సూచించారు. రాజ్యాంగ నిపుణులు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్‌కు తుది నివేదిక సమర్పించనున్నారు. సభకు రాకుండానే ప్రయాణ, దైనందిన భత్యాలు క్లెయిమ్ చేస్తున్నారా అనే అంశంపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరారు.
ఎన్నికైన ప్రతినిధులుగా ఎమ్మెల్యేల ప్రాథమిక బాధ్యత అసెంబ్లీలో ప్రజల గొంతుక వినిపించడం. ఒకవేళ నిరసన తెలపాలనుకుంటే సభ లోపల ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే అవకాశం ఉంటుంది. కానీ, సభకు రాకుండా ఇంటి వద్దే ఉంటూ జీతభత్యాలు తీసుకోవడం అనేది నైతిక విలువలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా పలువురు సభ్యులు గైర్హాజరైన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక పార్టీ మొత్తంగా బహిష్కరించినప్పుడు సాంకేతిక అంశాలు కీలకంగా మారుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, వరుసగా 60 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా గైర్హాజరైతే సభ్యత్వంపై వేటు పడే అవకాశం ఉంది. దీన్ని తప్పించుకోవడానికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా సంతకాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఒకవేళ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, అది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ప్రజల సొమ్మును వినియోగించుకుంటూ, ప్రజాస్వామ్య దేవాలయానికి రాకపోవడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే భేటీలో కమిటీ చేసే తీర్మానాలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపడం ఖాయం.






