YCP: తిరుమలలో మద్యం బాటిళ్ల డ్రామా! వైసీపీ చీప్ పాలిట్రిక్స్..?
కలియుగ వైకుంఠం, కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ, రాజకీయ స్వార్థం కోసం ఆ పవిత్రతను కూడా తాకట్టు పెట్టే నీచమైన ప్రయత్నం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై ఖాళీ మద్యం బాటిళ్లు ప్రత్యక్షమవ్వడం వెనుక ఉన్న అసలు కుట్రను పోలీసులు ఛేదించడంతో.. దీని వెనుక ఉన్నది వైసీపీ ప్లాన్ అని తేలిపోయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. ఈ క్రమంలో టీటీడీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి వైసీపీ శ్రేణులు వికృతమైన ప్లాన్ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల వంటి కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట మద్యం బాటిళ్లు దొరికాయని చిత్రీకరించడం, వాటిని ఫోటోలు తీసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, “చూడండి.. కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రత గంగలో కలిసింది, టీటీడీ వైఫల్యం చెందింది” అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేయడం వైసీపీ ఉద్దేశమని పోలీసులు చెప్తున్నారు.
మద్యం బాటిళ్లు దొరికిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు, విజిలెన్స్ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. అక్కడ సాధారణ భక్తులెవరూ వెళ్ళని చోట, కేవలం షూటింగ్ కోసం లేదా ప్రచారం కోసం వెళ్ళినట్లుగా ఆ బాటిళ్లను అమర్చారు. తిరుమల నిఘా నేత్రాలకు ఏదీ అసాధ్యం కాదు. సీసీ కెమెరాలను పరిశీలించగా, వైసీపీ అనుబంధ మీడియాకు చెందిన వ్యక్తులు, కొందరు పార్టీ కార్యకర్తలు రహస్యంగా ఆ బాటిళ్లను బ్యాగుల్లో మోసుకొచ్చి అక్కడ పడేసినట్లు ఆధారాలు లభించాయి. నిందితుల ఫోన్ లొకేషన్లు, ఆ సమయంలో వారి కదలికలు అన్నింటినీ పోలీసులు ట్రాక్ చేయడంతో అసలు గుట్టు రట్టయ్యింది.
ఈ వార్త బయటకు రాగానే భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో గెలవడానికి వేల మార్గాలు ఉంటాయి, కానీ ఇలా సాక్షాత్తు శ్రీవారి క్షేత్రాన్ని బ్రష్టు పట్టించాలని చూడటం క్షమించరాని నేరమని భక్తులు మండిపడుతున్నారు. గతంలో డిక్లరేషన్ విషయంలో జరిగిన వివాదాలను మరుగున పడేయడానికి, హిందువుల దృష్టి మళ్లించడానికి వైసీపీ ఇలాంటి ‘చీప్ ట్రిక్స్’ ప్లే చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తిరుమల మద్యం బాటిళ్ల కేసు వైసీపీ నైతిక పతనానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, దేవుడిని కూడా వాడుకోవాలని చూడటం వారి రాజకీయ అంతానికి దారితీస్తుంది. పోలీసులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి, ఇలాంటి కుట్రలకు పాల్పడిన వారిని కటకటాల్లోకి నెట్టాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటోంది.






