Dr Sudhakar: ఎట్టకేలకు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ సుధాకర్ కుటుంబం విషయంలో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర వేధింపులకు గురై, చివరకు మానసిక క్షోభతో మరణించిన ఒక దళిత వైద్యుడికి దక్కిన నైతిక విజయంగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది, గత ప్రభుత్వ వేధింపుల బాధితుడు దివంగత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రకటించిన భారీ ఊరట. సుధాకర్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయంతో పాటు, ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్‌కు డిప్యూటీ తహసీల్దార్ (గ్రూప్-2) హోదాలో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2020 కరోనా సమయంలో విశాఖపట్నంలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేసేవారు డాక్టర్ సుధాకర్. అప్పట్లో వైద్యులకు కనీసం మాస్కులు, పిపిఈ కిట్లు కూడా లేవని గళమెత్తారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే సాకుతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలకు దిగింది. విధుల్లో ఉండగానే ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత విశాఖ రోడ్లపై ఆయనను పోలీసులు బట్టలు ఊడదీసి, చేతులు వెనక్కి విరిచి కట్టి ఈడ్చుకువెళ్లిన దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయనను పిచ్చివాడిగా ముద్రవేసి, విశాఖలోని మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. ఇది ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. న్యాయపోరాటం చేస్తున్న క్రమంలోనే, ఆ వేధింపుల వల్ల కలిగిన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక 2021 మే నెలలో డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదని, ఒక వ్యవస్థ ద్వారా వేధింపులకు గురైన కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా అని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉన్న ఆయన కుమారుడికి నేరుగా గ్రూప్-2 స్థాయి పోస్టు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత గౌరవాన్ని కల్పించాలని ప్రభుత్వం భావించింది.
డాక్టర్ సుధాకర్ ఉదంతం ప్రజాస్వామ్యంలో గళమెత్తే వారిని అణచివేస్తే జరిగే పరిణామాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి కొంత ఉపశమనం కలిగించినా, ఒక ప్రతిభావంతుడైన వైద్యుడిని రాష్ట్రం కోల్పోవడం పూడ్చలేని లోటు. అయితే, ఈ నిర్ణయం ద్వారా తప్పు చేసిన వ్యవస్థే బాధితుడికి క్షమాపణ చెప్పి ఆదుకుంది* అనే సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరగడం, భవిష్యత్తులో పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.






