Canada: కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పులు.. భారతీయులకు ప్రయోజనం!
కెనడా (Canada) తన పౌరసత్వ చట్టాలను సవరించే దిశగా కీలక ముందడుగు వేసింది. కెనడా సిటిజన్‌షిప్ యాక్ట్‌ను మార్చే ‘బిల్ సీ-3’ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొంది త్వరలో చట్టంగా మారనుంది. వంశపారంపర్యత ఆధారంగా పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను సులభతరం చేయడమే ఈ కొత్త చట్టం లక్ష్యం. దీని ప్రకారం, విదేశాల్లో జన్మించిన లేదా దత్తత తీసుకున్న పిల్లలున్న కుటుంబాలకు న్యాయం చేకూరుతుందని కెనడా (Canada) ప్రభుత్వం వెల్లడించింది. కెనడియన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య భారత సంతతికి చెందిన వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతకుముందు 2009లో ప్రవేశపెట్టిన ‘ఫస్ట్ జనరేషన్ లిమిట్’ అనే నిబంధన కారణంగా, కెనడా (Canada) వెలుపల జన్మించిన కెనడియన్ పౌరులు తమ పిల్లలకు నేరుగా పౌరసత్వం అందించలేకపోయేవారు. అయితే 2023 డిసెంబర్ 19న ఒంటారియో సుపీరియర్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ పరిమితి రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది.
దీంతో కెనడా (Canada) ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొచ్చింది. కొత్త చట్టంలో ‘సబ్‌స్టాన్షియల్ కనెక్షన్ టెస్ట్’ అనే నిబంధనను చేర్చారు. దీని ప్రకారం, విదేశాలలో బిడ్డ పుట్టడానికి లేదా దత్తత తీసుకోవడానికి ముందు సదరు తల్లిదండ్రులు కనీసం 1,095 రోజులు (మూడేళ్లు) కెనడాలో (Canada) నివసించినట్లయితే వారి పిల్లలకు పౌరసత్వం ఇస్తుంది. అంతేకాకుండా, గతంలో పౌరసత్వం కోల్పోయిన వ్యక్తులకు కూడా సిటిజన్‌షిప్‌ను పునరుద్ధరిస్తుంది.






