ATA: వాషింగ్టన్ డీసీలో ఫుడ్ సేవలందించిన ఆటా
అమెరికా తెలుగు సంఘం (ATA) వివిధ సేవా కార్యక్రమాలతో కమ్యూనిటీకి చేరువవుతోంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ వేడుకలను పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా వాషింగ్టన్ డీసీలో పేరుగాంచిన డీసీ సెంట్రల్ కిచెన్ లో ఆటా నాయకులు, వలంటీర్లు పాల్గొని సేవలందించారు. ఈ సందర్భంగా ఆటా నాయకులు, వలంటీర్లు పోషక విలువలున్న భోజనాన్ని తరిగేందుకు, వండేందుకు మరియు ప్యాకేజింగ్ చేయడానికి సహాయం చేశారు. దాంతోపాటు కూరగాయలు, పండ్ల వినియోగానికి అవసరమైన నిధులను విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమం ఆటా సామాజిక బాధ్యత మరియు కమ్యూనిటీ భావాన్ని పెంపొందించింది. ఈ సేవ ద్వారా కమ్యూనిటీకి తాను చేస్తున్న సేవను మరోసారి తెలియజేసింది. ఆటా అమెరికాతోపాటు ఇండియాలో కూడా సామాజిక, ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. ఈ ధార్మిక కార్యక్రమాలలో ముఖ్యంగా ఆహార పంపిణీ, పేదవాళ్ళకోసం భోజనం తయారుచేయడం, ఆరోగ్య పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేయడం, వృద్ధులతో సమయం గడపడం, స్థానిక పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బందికి విరాళాలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆటా బృందం నిస్వార్థ సేవ, ఉత్సాహం మరియు అంకితభావాన్ని ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి వాలంటీర్ కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. బాల్టిమోర్‌లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు 19వ ఆటా కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్‌ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ మహాసభలకు 10,000 మందికి పైగా తెలుగు వాళ్ళు హాజరవుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.






