Viral News: అమెరికాలో తెలుగు జంట రీల్ వివాదం.. వారి వీసా రద్దు?
న్యూయార్క్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న రెండో ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం (World War II Memorial) వద్ద ఒక తెలుగు జంట చేసిన డాన్స్ రీల్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పవిత్రమైన యుద్ధ వీరుల స్మృతి వనం వద్ద వినోదం కోసం వీడియోలు తీయడంపై అమెరికన్లు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి వీసా రద్దు దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
అమెరికాలో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మధు రాజు అనే వ్యక్తి, తన భాగస్వామితో కలిసి వరల్డ్ వార్ II మెమోరియల్ వద్ద ఒక డాన్స్ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, సుమారు 4 లక్షల మంది సైనికుల త్యాగాలకు చిహ్నమైన చోట ఇలాంటి ప్రవర్తన ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. దాదాపు పది లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా, విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి
చర్యలకు డిమాండ్..
మధు రాజు ప్రస్తుతం హెచ్-1బి వీసాపై అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో, అమెరికన్ వెటరన్ల కుటుంబ సభ్యులు నెటిజన్లు ఆయన వీసాను రద్దు చేసి దేశం నుంచి పంపించేయాలని (డిపోర్టేషన్) డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే అమెరికా విదేశాంగ శాఖకు ఫిర్యాదులు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. వివాదం ముదరడంతో మధు రాజు తన సోషల్ మీడియా ఖాతాలను తన డాన్స్ స్టూడియో వెబ్‌సైట్‌ను కూడా తొలగించారు. ఆయన పనిచేస్తున్న సంస్థపై కూడా నెటిజన్లు ఒత్తిడి తెస్తున్నారు. యుద్ధ వీరులను అవమానించే వ్యక్తిని ఉద్యోగంలో ఎలా కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క ఘటన వల్ల అమెరికాలో ఉంటున్న ఇతర భారతీయులపై, ముఖ్యంగా వీసా నిబంధనలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రవాస ఆంధ్రులు ఆందోళన చెందుతున్నారు.
జాతీయ స్మారక చిహ్నాల వద్ద ఫోటోలు తీసుకోవడంపై పెద్దగా ఆంక్షలు లేకపోయినా, ఇలాంటి వాణిజ్యపరమైన లేదా వినోద కార్యక్రమాలు నిర్వహించడం నైతికంగా తప్పని భావిస్తున్నారు. ఈ ఘటనపై సదరు కంపెనీ గానీ, అధికారిక వర్గాలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది వేచి చూడాలి.
