NZ vs SA: ఫైనల్లో దర్జాగా కివీస్.. 33 బంతుల్లో సెంచరీతో చెలరేగిన అలెన్!
టీ20 వరల్డ్ కప్-2026 నాకౌట్ దశలో న్యూజిలాండ్ (NZvsSA) ఓపెనర్ ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసానికి అజేయమైన దక్షిణాఫ్రికా జట్టు పేకమేడలా కూలిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి సెమీ-ఫైనల్ పోరులో సఫారీలను చిత్తుచేసిన కివీస్.. అత్యంత దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆసాంతం ఎదురులేకుండా దూసుకొచ్చిన మార్క్రమ్ సేన అత్యంత కీలకమైన సెమీస్‌లో చేతులెత్తేసింది. కేవలం 33 బంతుల్లోనే అజేయ సెంచరీతో చెలరేగిన ఫిన్ అలెన్, ఒంటిచేత్తో కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
తేలిపోయిన సఫారీలు..
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న కివీస్ (NZvsSA) కెప్టెన్ వ్యూహం నూరు శాతం ఫలించింది. కివీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు సౌతాఫ్రికా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (18), డికాక్ (10), రికెల్టన్ (0) ఏమాత్రం ప్రభావం చూపకుండానే పెవిలియన్ చేరారు. యువ ఆటగాళ్లు డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా, అది ఎక్కువసేపు సాగలేదు. వేగం పెంచే క్రమంలో ఇద్దరూ వికెట్లు పారేసుకున్నారు.
ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (55 నాటౌట్) ఒక్కడే కివీస్ బౌలర్లపై ఒంటరి పోరాటం చేయడంతో.. సౌతాఫ్రికా (NZvsSA) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగుల స్కోరు చేయగలిగింది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకోంచీ, రచిన్ రవీంద్ర తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, నీషమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

అలెన్ విధ్వంసం..
అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ (NZvsSA) ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (58), ఫిన్ అలెన్ (100 నాటౌట్) ఆరంభం నుంచే సఫారీ బౌలర్లను ఊచకోత కోశారు. ముఖ్యంగా అలెన్.. ఏ దశలోనూ స్ట్రైక్ రేట్ 200కు తగ్గకుండా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి (303 స్ట్రైక్ రేట్‌తో) సఫారీ బౌలింగ్ లైనప్‌ను బెంబేలెత్తించాడు. సీఫెర్ట్ అవుటైన తర్వాత వచ్చిన రచిన్ రవీంద్ర (13 నాటౌట్) కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాడు. అలెన్ ధాటికి కివీస్ (NZvsSA) కేవలం 12.5 ఓవర్లలోనే 173/1 స్కోరుతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడకు మాత్రమే ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అలెన్‌ను వరించింది.
ఇవి కూడా చదవండి