T20 World Cup: సఫారీల చేతిలో ఘోర పరాభవం.. కొంపముంచిన వ్యూహాత్మక లోపాలు!
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)లో సూపర్-8 దశలో ఆడిన తొలి మ్యాచులోనే దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది. లీగ్ దశలో అదరగొట్టిన మన స్టార్లు.. కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేశారు. మైదానంలో ఆటగాళ్ల నిర్లక్ష్యం, పరిస్థితులపై అవగాహన లోపంతో పాటు మేనేజ్మెంట్ వ్యూహాత్మక తప్పిదాలే ఈ ఘోర పరాభవానికి ప్రధాన కారణమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆరంభం అదుర్స్.. ముగింపు బెదుర్స్
ఈ (T20 World Cup) మ్యాచులో టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత్‌కు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన శుభారంభం అందించారు. కట్టుదిట్టమైన స్లో బంతులతో సఫారీలను దెబ్బతీసి 20 పరుగులకే 3 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో మ్యాచ్ మన గుప్పిట్లోనే ఉందని అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ తర్వాత బౌలర్లు పట్టు నిలుపుకోలేకపోయారు. ముఖ్యంగా పిచ్ స్వభావాన్ని అంచనా వేయడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పూర్తిగా విఫలమయ్యారు. చివరి ఓవర్లో పాండ్యా ఏకంగా 20 పరుగులు సమర్పించుకొని ప్రత్యర్థికి భారీ స్కోరు కట్టబెట్టాడు.
ఇవి కూడా చదవండి
స్పిన్ ఉచ్చు.. కోహ్లీ లేని లోటు
ఛేజింగ్‌లో (T20 World Cup) భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా స్పిన్ ఉచ్చులో సులువుగా చిక్కుకున్నారు. తొలి ఓవర్లోనే స్పిన్నర్ మార్క్రమ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఔటవ్వగా.. పార్ట్ టైమ్ స్పిన్నర్లే మన కీలక వికెట్లు పడగొట్టడం గమనార్హం. సఫారీ పేసర్లు యాన్సన్, రబాడ, ఎంగిడి సైతం తమ సహజ వేగాన్ని పక్కనపెట్టి స్లో బంతులతో మనల్ని కట్టడి చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని జయించి మ్యాచ్‌లు గెలిపించే ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆసియా కప్‌లో మెరిసి కోహ్లీకి ప్రత్యామ్నాయం అనిపించుకున్న తిలక్ వర్మ.. ఇక్కడ దారుణమైన స్ట్రైక్ రేట్‌తో (100-110) నిరాశపరిచాడు. ఒంటరి పోరాటం చేసిన శివమ్ దూబె మినహా ఎవరూ క్రీజులో నిలబడే బాధ్యత తీసుకోలేదు.
సెలెక్షన్ తప్పులు.. కొరవడిన కసి
తుది జట్టు (T20 World Cup) ఎంపికలో మేనేజ్మెంట్ తప్పిదాలు స్పష్టంగా కనిపించాయి. ఫామ్‌లో లేని అభిషేక్ శర్మను కొనసాగిస్తూ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే అక్షర్ పటేల్‌ను పక్కనపెట్టడం విమర్శలకు తావిస్తోంది. మందకొడి పిచ్‌పై కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. వాషింగ్టన్ సుందర్ ప్రభావం చూపలేకపోగా, వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్‌ను సఫారీ బ్యాటర్ బ్రెవిస్ సునాయాసంగా ఎదుర్కొన్నాడు. ఇక (T20 World Cup) మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి కనిపించింది. కానీ భారత ఆటగాళ్లలో గెలవాలనే ఆకలి, సరైన భాగస్వామ్యాలు నిర్మించాలనే పట్టుదల లోపించాయి.
సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే..
ఇక ఈ టోర్నీ (T20 World Cup) సెమీస్‌కు చేరాలంటే భారత జట్టు ఫిబ్రవరి 26న చెన్నై వేదికగా జింబాబ్వేతో జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాలి. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే చెపాక్ పిచ్‌పై మనవాళ్లు ఈ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకొని బౌన్స్ బ్యాక్ అవుతారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
