మోదీ ‘ఓపెన్ ఆఫర్’.. రేవంత్ ‘చెక్ మేట్’!
తెలంగాణ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది కోరితే అది చేయడానికి సిద్ధం.. ఆయన అడిగిన అంశాలన్నింటికీ నా ఆమోదం ఉంది.. ఆయన నాతో కలిస్తే మరింత బాగుంటుంది.. అంటూ మోదీ ‘ఓపెన్ ఆఫర్‘ ఇచ్చారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమాధానం ఇచ్చారు.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపై విమర్శలు గుప్పించే మోదీ, రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా స్పందించడం వెనుక పెద్ద రాజకీయ సమీకరణమే కనిపిస్తోంది. ఇది కేవలం అభివృద్ధికి ఇచ్చిన హామీ మాత్రమే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ – బీజేపీల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ను మరింతగా దెబ్బతీయాలన్నది బీజేపీ ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో మోదీ భేటీ అయిన తరుణంలోనే, రేవంత్ రెడ్డికి ఈ తరహా ఆఫర్ ఇవ్వడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేశారా అన్న చర్చ మొదలైంది.
అయితే.., ప్రధాని వేసిన ఈ రాజకీయ పాచికను రేవంత్ రెడ్డి అంతే చాకచక్యంగా ఎదుర్కొన్నారు. మోదీ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోణంలోకి మళ్లించారు. “మోదీ మాటలను ఎవరికి వారు అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రధాని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.. నన్ను కాదు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం రాజ్యాంగబద్ధమైన హక్కు.. దాన్ని సాధించుకుంటాం.” అని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈ ఒక్క మాటతో మోదీ ఇచ్చిన ఆఫర్‌ను రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధిగా కాకుండా, రాష్ట్ర హక్కుగా మార్చేశారు. కేసీఆర్ కాలంలో తమకు నిధులు వద్దు.. మీ ప్రేమ చాలు అని మోడీతో అన్నారని, కానీ తమని అభివృద్ధి హక్కు అని రేవంత్ స్పష్టంచేశారు. ఈ తేడాను ప్రజలు గమనించాలని కోరారు. రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం కాలేదు. 2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న తన విజన్‌కు మోదీ ఆమోదం తెలిపారని చెప్తూనే, వాస్తవ గణాంకాలను ఎండగట్టారు.
ఆర్ఆర్ఆర్, మెగా టెక్స్టైల్స్, డిఫెన్స్ ల్యాండ్స్ వంటి పెండింగ్ అంశాలను క్లియర్ చేయించడం తన విజయమని చాటారు. కేంద్రం నుంచి ఆశించిన మేర సహకారం లేదు అని రేవంత్ కుండబద్దలు కొట్టారు. రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్, మెట్రో వంటి కీలక అంశాల్లో కేంద్రం ఇంకా మొండిచేయి చూపుతోందని, వాటిని సాధించుకునేందుకు ‘సింగిల్ విండో’ కావాలని ప్రధాని ముందే డిమాండ్ ఉంచారు.
రాజకీయంగా మోదీని ఢీకొనే విషయంలో రేవంత్ రెడ్డి మరింత కటువుగా వ్యవహరించారు. బీజేపీని “బ్రిటిష్ జనతా పార్టీ”గా అభివర్ణిస్తూ.. విభజించు-పాలించు సిద్ధాంతంపై దాడి చేశారు. ముస్లింలను, మావోయిస్టులను వేరుగా చూడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 818 మంది మావోయిస్టులను లొంగిపోయేలా చేయడం తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రేవంత్ స్పష్టం చేశారు. “బుల్లెట్ కాదు బ్యాలెట్” అని తాము నిరూపించామని సవాల్ విసిరారు.
ప్రధాని మోదీ ‘ఓపెన్ ఆఫర్’ ద్వారా ఒక స్నేహపూర్వక వాతావరణం సృష్టించి రేవంత్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టాలని చూస్తే.. రేవంత్ రెడ్డి ఆ ఆఫర్‌ను ‘రాష్ట్ర అభివృద్ధికి కనీస బాధ్యత’గా మార్చేసి, బీజేపీ విభజన రాజకీయాలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, తెలంగాణలో ఇకపై అభివృద్ధి విషయంలో సామరస్యం.. రాజకీయాల్లో సంఘర్షణ మరింత తీవ్రం కానున్నాయని అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి






