రేవంత్‌కు మోదీ ‘ఓపెన్ ఆఫర్’.. కాంగ్రెస్‌లో చిచ్చు!?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాత సామెత. కానీ, సాక్షాత్తూ దేశ ప్రధాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అదీ బహిరంగ సభ వేదికగా “తలుపులు తెరిచే ఉన్నాయి.. కలిసి పనిచేద్దాం” అని పిలుపునివ్వడం మాత్రం సాధారణ విషయం కాదు. హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరంలో పెను తుఫానును సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ విసిరిన ఈ రాజకీయ అస్త్రం వెనుక అసలు వ్యూహం ఏమిటి? గాంధీభవన్ గోడల మధ్య వినిపిస్తున్న గుసగుసల అంతరార్థం ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ మాటలు కేవలం ఆహ్వానాలు మాత్రమే కావు, అవి ప్రత్యర్థి పార్టీలో అయోమయాన్ని సృష్టించే పదునైన వ్యూహాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే నేరుగా అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరడం ద్వారా బీజేపీ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తోంది. సామాన్య కార్యకర్తల్లో పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు రేకెత్తించడం ఇందులో వ్యూహంగా ఉండొచ్చు. అలాగే పార్టీలో ప్రాధాన్యత దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులకు ఒక ప్రత్యామ్నాయ వేదిక సిద్ధంగా ఉందని చెప్పడం మోడీ ఉద్దేశంగా కనిపిస్తోంది. బీజేపీ ఈ వ్యాఖ్యల ద్వారా ‘ఆపరేషన్ ఆకర్ష్’కు ఒక కొత్త గ్లామర్‌ను అద్దినట్లయింది. ఢిల్లీ స్థాయి నుంచే ఆహ్వానాలు అందుతున్నాయనే భావనను కల్పించడం ద్వారా కాంగ్రెస్ పెద్దల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే ప్రధాని అసలు ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని వ్యాఖ్యలు వెలువడిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక మొదలైంది. గాంధీభవన్‌లో సీనియర్ నేతలు అత్యవసరంగా భేటీ కావడం, పరిస్థితిని సమీక్షించడం చూస్తుంటే లోలోపల భయం స్పష్టంగా కనిపిస్తోంది. సిద్ధాంతం మీద గౌరవం ఉన్నవారెవరూ పార్టీ వీడరని పైకి చెబుతున్నా, స్క్రీనింగ్ ప్రక్రియ మొదలయినట్లు తెలుస్తోంది. ఎవరెవరు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు? ఎవరెవరు ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేతలు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లారు. అసమ్మతి నేతలను బుజ్జగించడం, క్యాడర్లో ధైర్యం నింపడం ఇప్పుడు వారికి సవాలుగా మారింది.
ప్రధాని వంటి స్థాయి ఉన్న నేత ఇంతటి కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నుంచి మెరుపు వేగంతో స్పందన రావాల్సి ఉంది. కానీ, కొంత జాప్యం జరగడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఆలస్యం బీజేపీకి మరింత ప్రచారం లభించేలా చేసింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల నేపథ్యంలో అభివృద్ధి కోసం పిలుపునిచ్చారా? లేక రాజకీయంగా బలహీనపరిచే ఎత్తుగడనా? అనే చర్చ సాగుతుండగానే, క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.
ప్రధాని మోదీ విసిరిన ఈ ఓపెన్ ఆఫర్ కేవలం రాజకీయ అస్త్రమేనా లేక రాబోయే రోజుల్లో జరగబోయే భారీ మార్పులకు సంకేతమా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాంగ్రెస్ తన కోటను కాపాడుకోవడానికి సిద్ధమవుతుంటే, బీజేపీ మాత్రం ‘తలుపులు తెరిచే ఉన్నాయని’ పదే పదే గుర్తు చేస్తోంది. గాంధీభవన్ గోడల మధ్య మొదలైన “ఎవరు వెళ్తారు? ఎవరు ఉంటారు?” అనే టెన్షన్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. ఒకటి మాత్రం స్పష్టం.. మోదీ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిని ఒక్కసారిగా రాజేశాయి.
ఇవి కూడా చదవండి






