Kavitha: దసరా నాటికి కవిత కొత్త పార్టీ..!?

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) కొత్త మలుపు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కుమార్తె కవిత కొత్త రాజకీయ పార్టీని (New Party) స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదిప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కవిత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) బ్యానర్‌పై సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆమె మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నట్టు తెలుస్తోంది.
కవిత కొంతకాలంగా బీఆర్ఎస్ వ్యవహారలపై తీవ్ర అసంతృత్పితో ఉన్నారు. ఆమె ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (TBGKS) అధ్యక్ష పదవి నుంచి ఆమెను తొలగించి, ఆ స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను నియమించింది పార్టీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో తెలంగాణ భవన్‌లో ఈ నిర్ణయం జరిగింది. దీనిపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తను అందుబాటులో లేనప్పుడు తనను తొలగించడం సరికాదని చెప్పారు. అయినా కార్మికుల సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, కొప్పుల ఈశ్వర్ కు శుభాకాంక్షలు చెప్తూ ఒక లేఖ విడుదల చేశారు.
ఈ సంఘటన కవిత, బీఆర్ఎస్ నాయకత్వం మధ్య ఉన్న గ్యాప్ ను మరింత స్పష్టం చేసింది. గతంలో కూడా, కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన ఒక లేఖ లీక్ కావడం, బీఆర్ఎస్-బీజేపీ మధ్య విలీనం గురించి చర్చలు జరిగాయని ఆమె ఆరోపించడం వంటి సంఘటనలు పార్టీలో అంతర్గత సమస్యలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో, ఇక బీఆర్ఎస్‌లో కొనసాగడం సమంజసం కాదని కవిత నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా నాటికి ఆమె పార్టీని సిద్ధం చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుజన సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తెలంగాణ జాగృతి ద్వారా పలు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ, కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా, సింగరేణి జాగృతి కమిటీని ఏర్పాటు చేసి, తొమ్మిది మంది కన్వీనర్‌లను నియమించింది.
కవిత ఇప్పటికే బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులతో, మాజీ బీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కొంతమంది నాయకులు కవిత వెంట నడిచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి ద్వారా కవిత గత కొన్నేళ్లుగా మహిళలు, యువత, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. 2006లో ఈ సంస్థను స్థాపించిన కవిత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ద్వారా ఆమె యువతకు నైపుణ్య శిక్షణ, కార్మిక సంఘాలతో సంబంధాలు, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. తాజాగా, బీసీలకు 42% రిజర్వేషన్‌ల కోసం 72 గంటల దీక్ష చేపట్టడం, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఆమె ప్రజల్లోకి వెళుతున్నారు.
కవిత కొత్త పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ బలహీనపడింది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టడం ద్వారా కేసీఆర్ కుటుంబం మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇది తప్పకుండా పార్టీ పైన కూడా ప్రభావం చూపించనుంది.