Layoffs: ఒక్క ఏడాదిలోనే అమెరికాలో పదిలక్షల ఉద్యోగాలు కోత…
అమెరికాలో ఉద్యోగం ఓ డ్రీమ్.. అయితే ఇప్పుడా డ్రీమ్ కాస్తా కరిగిపోతోంది. ఇప్పుడు అమెరికా ఉద్యోగ విపణిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత అనిశ్చితి నెలకొంది. అక్టోబర్ నెలలో అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగాల కోత విధించాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా 1,53,074 మందిని తొలగించినట్లు ప్రైవేట్ కన్సల్టింగ్ సంస్థ ‘చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్’ తన నివేదికలో వెల్లడించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 10.9 లక్షల ఉద్యోగాల కోత నమోదైందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 65 శాతం అధికమని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభించిన 2020 తర్వాత ఈ స్థాయిలో లేఆఫ్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అధికారిక ఉద్యోగ డేటా విడుదల నిలిచిపోవడంతో ఆర్థికవేత్తలు ప్రైవేట్ రంగ సంకేతాలపై ఆధారపడాల్సి వస్తోంది.
విశ్లేషకుల ప్రకారం ఈ ఉద్యోగాల కోతకు ఒకేసారి అనేక కారణాలు తోడయ్యాయి. టారిఫ్‌ల వల్ల పెరుగుతున్న ఖర్చులు, వినియోగదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్, అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ వైపు వేగంగా మొగ్గు చూపడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. “తక్కువ మంది సిబ్బందితోనే కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగలమని భావిస్తున్నాయి. ఇది కార్మిక మార్కెట్లో దీర్ఘకాలిక పునర్వ్యవస్థీకరణలో భాగం” అని ఈవై-పార్థినాన్ చీఫ్ ఎకనమిస్ట్ గ్రెగొరీ డాకో వివరించారు. ముఖ్యంగా టెక్, వైట్ కాలర్ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ లేఆఫ్‌ల పర్వం కేవలం నిరుద్యోగ సమస్యకే పరిమితం కాదని, రాబోయే పండుగ సీజన్లో వినియోగదారుల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు, బలహీనమైన నియామకాలు, పెరుగుతున్న లేఆఫ్‌లు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.







