PAK ISI: భారత్ పై దాడుల వెనక పాకిస్తాన్ ‘S1’ యూనిట్..
భారత్ పై దశాబ్దాలుగా సీమాంతర పోరు జరుపుతోంది పాకిస్తాన్. సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను ఎగదోస్తూ మారణహోమానికి పాల్పడుతోంది. ఇన్నాళ్లు ఇది పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) పనేనని అందరూ భావించారు. అయితే దీనికి గానూ ISI లోని ఓ రహస్య విభాగం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘S1’ అనే కోడ్ పేరుతో పనిచేస్తున్న ఈ యూనిట్, 1993 ముంబై వరుస పేలుళ్ల నుంచి ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి వరకు అనేక దుశ్చర్యలకు సూత్రధారి అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ‘S1’ అంటే ‘సబ్ వెర్షన్ 1’. పాకిస్థాన్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని నడిపించే అతిపెద్ద శక్తి ఇదేనని తెలుస్తోంది. ఈ రహస్య విభాగానికి పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఒక కల్నల్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తుండగా, ‘గాజీ 1’, ‘గాజీ 2’ అనే కోడ్ పేర్లతో ఇద్దరు అధికారులు క్షేత్రస్థాయి ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనిట్ కార్యకలాపాలకు అవసరమైన నిధులను ఎక్కువగా మాదకద్రవ్యాల విక్రయం ద్వారానే సమకూర్చుకుంటున్నట్లు సమాచారం.
ఈ ‘S1’ యూనిట్‌లోని సిబ్బంది అన్ని రకాల బాంబులు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల (IED) తయారీలో నిపుణులు. చిన్నపాటి ఆయుధాలను వాడటంలోనూ వీరికి పూర్తి నైపుణ్యం ఉంది. అంతేకాకుండా, భారతదేశంలోని చాలా ప్రాంతాలకు సంబంధించిన సమగ్రమైన మ్యాప్‌లు వీరి వద్ద ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
గత 25 ఏళ్లుగా ఈ విభాగం చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ, దీని పూర్తి కార్యకలాపాల స్వరూపాన్ని భారత భద్రతా ఏజెన్సీలు ఇటీవలే డీకోడ్ చేయగలిగాయి. కేవలం భారత్‌లో దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేసే ‘S1’, పాకిస్థాన్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి అన్ని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉంది.







