Trump: టారిఫ్ లపై మా అధికారాన్నే ప్రశ్నిస్తారా..? ట్రంప్
టారిఫ్ లపై ఎదురవుతున్న విమర్శలు, న్యాయపరమైన చిక్కులు ట్రంప్ సర్కార్ ను చికాకు పరుస్తున్నాయి. అధ్యక్షుడిగా తనకున్న అపరిమిత అధికారాలను ప్రశ్నించడంపై ..ట్రంప్ (Trump) తీవ్ర అసహనంతో ఉన్నారు. వీటిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా, అక్కడి కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కూడా అధ్యక్షుడి అధికారాలపై సందేహాలు వ్యక్తం చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోందని, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
‘‘సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం. ద్రవ్యోల్బణం దాదాపు లేదు. రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. లక్షల డాలర్లు వస్తున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించడం మొదలుపెడతాం. డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి (అధిక ఆదాయం ఉన్నవారికి కాకుండా) కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అసలేం జరుగుతోంది..?
‘‘ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపేసేందుకు, లైసెన్స్ ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఆమోదం ఉంది. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశాలపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా..? ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోంది. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వేయకూడదు..? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం కోర్టుకు ఇది తెలియదా? అసలేం జరుగుతోంది..?’’ అని ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా దిగుమతి సుంకాలు మార్చడం, కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.







