Washington: అమెరికన్ ఎయిర్ లైన్స్ పై షట్ డౌన్ ఎఫెక్ట్..
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ … ఆ దేశ విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రీ షెడ్యూల్ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
భద్రతా కారణాల దృష్ట్యా దేశంలోని రద్దీ ఎక్కువగా ఉండే 40 ప్రాంతాల్లో విమాన సర్వీసులను 10 శాతం వరకు తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విమానయాన సంస్థలను ఆదేశించింది. శుక్రవారం నాటికి 750కి పైగా విమాన సర్వీసులను ముందుగానే రద్దు చేసినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ వెల్లడించింది. ప్రముఖ విమానయాన సంస్థ అమెరికన్ ఎయిర్‌లైన్స్ రోజుకు 220 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, డెల్టా ఎయిర్‌లైన్స్ శుక్రవారం 170 సర్వీసులను, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 100 సర్వీసులను నిలిపివేసినట్లు తెలిపాయి.
ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది సహా వేలాది మంది కీలక ఉద్యోగులకు జీతాలు అందడం లేదు. దీంతో సిబ్బంది కొరత ఏర్పడింది. చాలామంది అనారోగ్య కారణాలతో సెలవులు పెడుతుండటంతో ఏటీసీ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే గురువారం 6,400కు పైగా విమానాలు ఆలస్యంగా నడవగా, 200 సర్వీసులు రద్దయ్యాయి. బోస్టన్, నెవార్క్ విమానాశ్రయాల్లో ప్రయాణికులు రెండు గంటలకు పైగా, షికాగో, వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుల్లో గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది.
“ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, ముందే మేల్కోవడం మంచిదని భావిస్తున్నాం. పరిస్థితులు దిగజారకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం” అని ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ బ్రయాన్ బెడ్ఫోర్డ్ తెలిపారు. కొన్ని వారాల్లో థ్యాంక్స్‌గివింగ్ సెలవులు రానున్న నేపథ్యంలో ప్రయాణాల రద్దీ మరింత పెరగనుంది. ఈ సమయంలో విమానాల రద్దు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయనుంది. అట్లాంటా, డెన్వర్, చికాగో, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ వంటి ప్రధాన విమానాశ్రయాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.







